Sabarimala Temple: శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు..

Sabarimala Temple: శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు..
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.

శబరిమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగి గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడి ఏర్పాట్లపై కేరళ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మౌలిక వసతుల లేమిపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో అయ్యప్ప దర్శనం కాకుండానే వెనుతిరుగుతున్నామని మండిపడుతున్నారు. అటు.. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు వామపక్ష ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఐతే విపక్షాలు కావాలనే ఈ సమస్యను పెద్దది చేస్తున్నాయని భక్తులు రాక భారీగా పెరగడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని పినరయి సర్కార్‌ వివరణ ఇస్తోంది.

శబరిమలలో రద్దీ నిర్వహణ సమస్యపై వేళ్లన్నీ పినరయి విజయన్‌ సర్కార్‌ వైపే చూపిస్తున్నాయి. ప్రభుత్వం కావాలనే శబరిమల సమస్యలపై అలసత్వం వహిస్తోందని విపక్షాలు, భక్తులు ఆరోపిస్తున్నారు. శబరిమలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయనీ.. అయినా జాతీయ మీడియా దీనిని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇది దిల్లీకి సమీపంలో జరిగి ఉంటే కథ వేరేలా ఉండేదని మండిపడ్డారు. రద్దీ నిర్వహణకు పోలీసులను మోహరించడం, రవాణా సేవల విస్తరణ, వైద్యం,ఆహారం, మంచినీరు అందించడంలో ప్రభుత్వంఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

శబరిమల పరిసరాల్లో ప్రస్తుత పరిస్థితిపై భాజపా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిలక్కల్‌లోని పార్కింగ్ గ్రౌండ్‌ను సందర్శించిన భాజపా నేత కుమ్మనం రాజశేఖరన్‌ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ బాధ్యతన్నారు. భక్తులు గతంలో కన్నా ఎక్కువగా తరలివస్తుండటంతోనే ఇలా జరిగిందన్న దేవస్థానం బోర్డు వివరణలను ఖండించారు. ఏటా 30 శాతం భక్తుల రద్దీ పెరుగుతుందని తెలిసినప్పుడు చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పంబాలో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను ఎందుకు వసతీ ఏర్పాట్లకు వినియోగించలేదన్నారు. 20 ఏళ్లుగా నిలక్కల్ నుంచి రహదారి మార్గాన్ని ప్రభుత్వం ఎందుకు విస్తరించలేదని నిలదీశారు.

శబరిమల అంశంపై మాట్లాడిన ఆ రాష్ట్రసీఎం పినరయి విజయన్‌ భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. శబరిమలకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆలయానికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఇతర రాష్ట్రాల భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు. వాహనాలను పంబా వరకు అనుమతించకపోవడంతో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు వాహనాలను బోలక్కల్ వరకే అనుమతిస్తున్న అధికారులు అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని పంబకు ప్రభుత్వ బస్సుల్లో వెళ్లాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story