Manipur: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తు తెలియని డ్రోన్లు

Manipur: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై  గుర్తు తెలియని డ్రోన్లు
కొన్ని గంటలపాటు విమానాశ్రయం మూసివేత

ఇంఫాల్‌ గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో జరిగిన ఈ సంఘటన కాసేపు కలకలం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రాజధాని ఇంఫాల్‌లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంలో గుర్తుతెలియని డ్రోన్లు ఎగురుతుండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. ఆ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. అక్కడికి చేరుకోవాల్సిన విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు.

కాగా, మణిపూర్‌లోని మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. మే నెలలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించగా నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. హింసాత్మక సంఘటనల్లో సుమారు 200 మంది మరణించగా వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. మరోవైపు శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో మణిపూర్‌ ప్రభుత్వం ఇంటర్‌నెట్‌పై నిషేధాన్ని నవంబర్‌ 23 వరకు పొడిగించింది. మణిపూర్‌లో హింస 90 శాతం అదుపులోకొచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఆరు నెలలుగా జాతి విద్వేషాలు నిరాటంకంగా ఇప్పటికీ సాగుతూ, అప్పుడప్పుడూ మంటలు చెలరేగుతునే వున్నాయి. మణిపూర్‌లో మెయితీ, కుకీల మధ్య జాతివిభజన ఏర్పడింది. జాతి విద్వేషాలు మొదలవగానే మెయితీలు ఎక్కువగా ఉన్న లోయ ప్రాంతాల నుంచి కుకీలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాగే కుకీలు అధికంగావున్న కొండప్రాంతం నుంచి మెయితీలు ఖాళీచేసి వెళ్ళిపోయారు. వారి మధ్య విభజన పూర్తయి, దేశాల మధ్య సరిహద్దుల్లా విభజన రేఖకు ఇరువైపులా భద్రతా దళాలు మోహరించి, అటువాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు వెళ్ళడం ఆగిపోయింది.


పోలీసుల నుంచి, రిజర్వు బెటాలియన్ ఆయుధాగారం నుంచి వేలాది ఆటోమేటిక్ ఆయుధాలు, రాకెట్ లాంచర్లు, లక్షల సంఖ్యలో మందుగుండు సామాగ్రిని ఎత్తుకుపోయారు. సాయుధ ముఠాలు సాధారణ పౌరులపైన చేపట్టే హింసాత్మక దాడులలో వీటిని ఉపయోగించాయి.ఎత్తుకెళ్ళిన ఆయుధాలను అప్పగించేయాలని రాష్ర్ట ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఎలాంటి ఫలితం లేదు. ఈ జాతి విద్వేష హింసలో 200 మంది ప్రాణాలను కోల్పోగా, 75 వేల మంది తమ నివాస ప్రాంతాల నుంచి తరలిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story