Delhi Air Pollution: ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం

Delhi Air Pollution: ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం
మళ్లీ ప్రమాదకర స్థాయికి పడిపోయిన వాయు నాణ్యత

ఢిల్లీని వాయుకాలుష్యం పట్టి పీడిస్తోంది.. నగరంలో రోజురోజుకు కాలుష్య తీవ్రత పెరిగిపోతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగకు తోడు, పంజాబ్‌ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత కూడా ఢిల్లీకి శాపంగా మారింది. ఇవాళ వాయు నాణ్యత మళ్లీ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత వ్యాధులతో చాలా మంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. గత ఆదివారం వరకు వాయు నాణ్యత మెరుగుపడినా ఇవాళ అకస్మాత్తుగా తగ్గిపోయింది.

ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, రాత్రి వేళలో గాలి వేగం తగ్గడం గాలి నాణ్యత పడిపోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం 8 గంటలకు నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 401 పాయింట్లుగా నమోదై ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గురువారం 390, బుధవారం 394, మంగళవారం 365, సోమవారం 348, ఆదివారం 301 పాయింట్లుగా ఏక్యూఐ నమోదైంది.


గత ఆదివారం కాలుష్య తీవ్రత తగ్గడంతో రాజధాని పరిధిలో పలు నిర్మాణ ప్రాజెక్టుల పనులపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. కాలుష్యకారక ట్రక్కుల ప్రవేశంపై ఆంక్షలను తొలగించడంతో పొల్యూషన్ మళ్లీ పెరిగింది. దీనికి తోడు సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు దహనం చేయడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. పొరుగున ఉన్న ఘజియాబాద్ (386), గురుగ్రామ్ (321), గ్రేటర్ నోయిడా (345), నోయిడా (344), ఫరీదాబాద్ (410)లలో కూడా వాయు నాణ్యత చాలా పేలవ స్థితి నుంచి తీవ్ర స్థాయికి చేరుకుంది.

పుణే(Pune)కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ హెచ్చరిక ప్రకారం, కాలుష్య స్థాయిలు రానున్న వారం రోజుల్లో తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ఐఐటీ(IIT) కాన్పూర్ నివేదిక ప్రకారం.. గురువారం ఏర్పడిన కాలుష్యంలో వాహనాల ఉద్గారాల వాటా 38 శాతంగా ఉంది. ఢిల్లీలోని దుర్వాసన పొల్యూషన్ కి రెండో కారణం. పొరుగు రాష్ట్రాలలో పంటకోత తర్వాత వరి గడ్డిని కాల్చడం సహా బయోమాస్ దహనం వాయు కాలుష్యం పెరగడానికి 21 శాతం కారణమైంది.

కాగా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ 100 లోపు ఉంటే దాన్ని కాలుష్య రహిత వాతావరణంగా చెప్పవచ్చు. ఏక్యూఐ 100 నుంచి 200 వరకు ఉంటే ఓ మోస్తరు కాలుష్యంగా పేర్కొంటారు. ఏక్యూఐ 200 నుంచి 300 వరకు ఉంటే కాలుష్య భరిత వాతావరణంగా చెబుతారు. ఏక్యూఐ 300 నుంచి 400 వరకు ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉన్నదని, ఏక్యూఐ 400 నుంచి 500 వరకు ఉంటే తీవ్రమైన వాయు కాలుష్యంగా చెప్తారు.

Tags

Read MoreRead Less
Next Story