Karnataka: పాకిస్థాన్ బీజేపీకి శత్రుదేశం, మాకు కాదన్న కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ

Karnataka: పాకిస్థాన్ బీజేపీకి శత్రుదేశం, మాకు కాదన్న కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ
కర్ణాటక అసెంబ్లీలో దుమారం

కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నసీర్ హుస్సేన్ గెలుపు సందర్భంగా ఆయన మద్దతుదారుల్లో ఒకరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం.. విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలే కావాలని ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి.

అసలు దీనికి బీజాలు మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాల అనంతరం పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయోత్సవాల్లో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని శాసన సభలో లేవనెత్తారు.

బీజేపీకి పాకిస్తాన్ శత్రుదేశం కావచ్చని.. కాంగ్రెస్‌కి మాత్రం పొరుగు దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే బీజేపీని విమర్శించే క్రమంలో హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు అనుకూలంగా మారాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే బీజేపీకి ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలతో కర్ణాటక రాజకీయాలు అట్టుడికి పోతుండగా.. తాజాగా హరిప్రసాద్ చేసి వ్యాఖ్యలు వాటికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ దేశ వ్యతిరేక సెంటిమెంట్లను కలిగిస్తోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.

ముఖ్యమంత్రి, హోం మంత్రి స్పందిస్తూ, ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాత దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇదే వ్యవహారంపై నాసిర్‌ హుస్సేన్‌ కూడా స్పందించారు. పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని.. శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ నినాదాలను ఖండించిన నాసిర్ హుస్సేన్.. అధికారులు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story