Amarnath Yatra: అమరనాధుని దర్శనానికి భక్తులు

భారీ భద్రతల నడుమ శివయ్యను దర్శించుకోనున్న భక్తులు

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం అయ్యింది. ఈ రోజు నుంచి ఆగస్టు 31 వరకు జరగనున్న ఈ యాత్రకు జమ్మూకశ్మీర్‌ సర్కార్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. బేస్ క్యాంపు నుంచి భారీ భద్రతల నడుమ భక్తులు శివయ్యను దర్శించుకోవడానికి బయలుదేరారు.





దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉంది అమర్‌నాథ్‌ క్షేతం. ఇక్కడ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకోడాన్ని పూర్వ జన్మ సుకృతం గా భావిస్తారు. ఏడాదిలో రెండు నెలల పాటూ జరగనున్న ఈ యాత్ర లో పాల్గొనటానికి భక్తులు ఆర్తితో ఎదురు చూస్తారు. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు కొన్ని నెలల ముందు గానే పేర్లు నమోదు చేసుకుంటారు.

సాధారణం గా రెండు మార్గాల ద్వారా అమర్‌నాథ్‌ గుహకు చేరుకుంటారు భక్తులు. మొదటి మార్గంలో వెళ్లేవారు పెహల్గావ్‌ నుంచి పంచతరణికి వెళ్లి.. అక్కడి నుంచి గుహకు చేరుకుంటారు. రెండోమార్గం శ్రీనగర్‌ నుంచి బాల్తాల్‌కు వెళ్లి.. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల ప్రయాణించి.. మంచులింగాన్ని దర్శించుకుంటారు.





ఈ నేపథ్యంలో జమ్మూ బేస్ క్యాంపులోని యాత్రి నివాస్ నుంచి బల్తాల్, పెహల్గామ్ క్యాంపులకు భారీ భద్రత మధ్య బస్సుల్లో యాత్రికులు పయనమ్యారు. యాత్రికుల వాహనాలను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. పహల్గామ్ బేస్ క్యాంపు నుంచి వెళ్లే యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని నున్వాన్ దారి మీదుగా 48 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక బల్తాల్ బేస్ క్యాంపు నుంచి వెళ్తే సెంట్రల్ కశ్మీర్‌లోని గండర్బల్ మీదుగా 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి.

అయితే అమర్‌నాథ్‌ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని.. దాడులు జరగవచ్చని నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో రాజౌరీ-పూంఛ్‌, పిర్ పంజాల్, చీనాబ్‌ వ్యాలీ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అడుగడుగునా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టారు. సీఆర్‌పీఎఫ్‌తో పాటు ఐటిబి పి పోలీసులు కూడా నిఘాను పర్యవేక్షిస్తున్నారు.

గతంలో ఈ యాత్రకు సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ మాత్రమే భద్రత కల్పిస్తూ ఉండేది. ఈసారి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ చేత భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.గతేడాది జులై 8న అమర్‌నాథ్‌లో మెరుపు వేగంతో వరదలు సంభవించినప్పుడు ఐటీబీపీ జవాన్లు అత్యంత సమర్థవంతంగా రెస్క్యూ చేపట్టారు. చాలా మంది భక్తులను కాపాడారని, అందువల్ల ఈసారి భద్రత బాధ్యతను వారి కూడా అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తం మీద అమర్‌నాథ్ యాత్రలో ఆరు చోట్ల ఐటీబీపీ, బీఎస్ఎఫ్ దళాలను మోహరించి, భద్రత కల్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story