One Nation, One Election: కమిటీలో 8 మంది సభ్యులు

One Nation, One Election: కమిటీలో 8 మంది సభ్యులు
అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు..శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు చోటు

జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్రం చురుగ్గా చర్యలు చేపడుతోంది.మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ వేయనున్నట్లు శుక్రవారం ప్రకటించిన మోదీ సర్కార్, శనివారం 8 మంది సభ్యుల కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిం ద్ఈ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఏడుగురిని సభ్యులుగా నియమించింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలోని ప్రతిపక్ష పార్టీల్లో అతిపెద్దదైన కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్‌ చౌదరి, రాజ్యసభ మాజీసభ్యుడు గులాం నబీ అజాద్‌, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎన్‌.కె. సింగ్‌ , లోక్‌సభ మాజీ సెక్రటలీ జనరల్ సుభాష్‌ సి కశ్యప్‌, సీనియర్ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ సీవీసీ సంజయ్ కొఠారీలను సభ్యులుగా కేంద్ర న్యాయశాఖ నియమించింది. కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్రప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలను నియమించింది. కమిటీ తక్షణమే పనిప్రారంభించాలని న్యాయశాఖ ఆదేశించింది. లాకమిషన్‌ 170వ నివేదిక, 2015 డిసెంబరులో ప్రజావినతులు, న్యాయ విభాగపు.... పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదిక ఒకే దేశం, ఒకే ఎన్నికను సిఫారసు చేశాయని కేంద్ర న్యాయశాఖ తన ఆదేశాల్లో తెలిపింది.ఈ సిఫారసుల మేరకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ నిబంధనల మేరకు అధ్యయనం చేయాలని పేర్కొంది. ఇందుకు రాజ్యాంగ సవరణలు, ప్రజాప్రాతినిథ్య చట్టం 1950,1951, ఇతర చట్టాలను పరిశీలించాలని సూచించింది.


ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రాల అనుమతి కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సివస్తే అధ్యయనం చేసి సిఫారసు చేయాలని కమిటీకి సూచించింది. ఒకేసారి ఎన్నికలు జరిపినపుడు ప్రజాతీర్పు హంగ్ వస్తే,అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే, ఫిరాయింపులు తదితర పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలో విశ్లేషించి పరిష్కారాలను సిఫారసు చేయాలని కోరింది. ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ సూచించడంతో పాటు ఎన్ని దశల్లో జరపాలి, కాలపరిమితిని సూచించాలని కోరింది. అందుకు రాజ్యంగ సవరణ అవసరమైతే సిఫారసు చేయాలని సూచించింది. ప్రతిసారి జమిలి ఎన్నికలు తప్పనిసరిగా జరిపేందుకు అవసరమైన సురక్షిత విధానాలను సూచించాలని, ఈ ఎన్నికల చక్రం.... దెబ్బతినకుండా ఉండేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను కూడా సూచించాలని కేంద్రం కోరింది.

ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు వంటి సౌకర్యాలను కూడా అధ్యయనం చేయాలని సూచించింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకే ఓటర్లు జాబితా, గుర్తింపు కార్డులు జారీచేసేందుకు తగిన సిఫారసులు చేయాలని కేంద్ర న్యాయశాఖ జమిలి ఎన్నికల కమిటీకి సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story