AIADMK : అన్నాడీఎంకె నుంచి పన్నీర్ సెల్వం ఔట్..

AIADMK : అన్నాడీఎంకె నుంచి పన్నీర్ సెల్వం ఔట్..
AIADMK : పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించిన అన్నాడీఎంకె పార్టీ

AIADMK : అన్నాడీఎంకేలో సీనియర్ నేత పన్నీర్‌ సెల్వం సుదీర్ఘ ప్రస్థానం ముగిసింది. పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సాకు చూపి అత్యంత అవమానకరస్థితిలో పన్నీర్‌ను పార్టీ నుంచి బయటకు పంపింది పళని వర్గం. ఆయన అనుచరులపైనా బహిష్కరణ వేటు వేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసి..పదవుల నుంచి తప్పించింది. ఈ మేరకు ఇవాళ జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

ఐతే ఈ నిర్ణయంపై పన్నీర్‌ సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే నుంచి తానే పళనిస్వామిని తొలగిస్తున్నానని ప్రకటన చేశారు. పార్టీ నుంచి తనను తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు పన్నీర్‌ సెల్వం. అన్నాడీఎంకే తానే కోశాధికారినని...పార్టీ ఈపీఎస్‌ సొంతం కాదన్నారు.

అన్నాడీఎంకే చీఫ్‌ దివంగత జయలలితకు అత్యంత సన్నిహితుల్లో పన్నీర్ సెల్వం ఒకరు. 1973లో AIDMK సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన పన్నీర్ సెల్వం...పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1996-2001 మధ్య పెరియాకులం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పని చేశారు. ఐతే 2001లో సుప్రీంకోర్టు జయలలితకు జైలు శిక్ష వేయడంతో పన్నీర్‌కు ఫస్ట్ టైం సీఎం పదవి అధిష్టించే అవకాశం వచ్చింది.

అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన పన్నీర్‌కు జయలలిత సీఎంగా అవకాశమిచ్చారు. దాదాపు 6 నెలల పాటు సీఎం పదవిలో కొనసాగారు పన్నీర్ సెల్వం. తర్వాత జయలలిత కేబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. 2006లో జరిగిన ఎన్నికల్లో AIDMK ఓడిపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.

2011లో మళ్లీ అన్నా డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఐతే 2014 సెప్టెంబర్‌లో అక్రమాస్తుల కేసులో కోర్టు జయలలితను దోషిగా నిర్ధారించడంతో పన్నీర్‌కు రెండోసారి సీఎంగా అవకాశం దక్కింది. 2015 మే 22 వరకు సీఎంగా కొనసాగారు పన్నీర్‌సెల్వం. తర్వాత జయలలిత కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా చేశారు.

తర్వాత 2016లో జయలలిత అనారోగ్య కారణాలతో చనిపోవడంతో మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు పన్నీర్. తర్వాత పార్టీపై పట్టు కోసం శశికళ, పన్నీర్‌ సెల్వంల మధ్య పోటీ నడిచింది. దీంతో పార్టీ నుంచి శశికళను బహిష్కరించారు పన్నీర్ సెల్వం. తర్వాత సీఎంగా పళనిస్వామి బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి 2021 వరకు డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహించారు పన్నీర్ సెల్వం.

ఐతే జయలలిత మరణం తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని రద్దు చేసి...ద్వంద్వ నాయకత్వాన్ని ప్రవేశపెట్టారు. కో ఆర్డినేటర్‌, జాయింట్ కో ఆర్డినెటర్‌ పదవులను తీసుకువచ్చారు. ఐతే దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్టీకి ఒకరే నాయకత్వం వహించాలంటూ ఒత్తిడి వచ్చింది. దీంతో పార్టీపై పట్టు కోసం పళని, పన్నీర్‌ మధ్య యుద్ధం సాగింది. కొద్దిరోజులుగా పార్టీ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఐతే ఇవాళ జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు సభ్యులు. 4 నెలల్లో పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ద్వంద్వ నాయకత్వ విధానాన్ని రద్దు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐతే తనను పార్టీ నుంచి ఎవరూ బహిష్కరించలేరంటూ ప్రకటన చేశారు పన్నీర్ సెల్వం. తానే పళనిస్వామిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో చెన్నైలోని పార్టీ ఆఫీసు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈపీఎస్‌-ఓపీఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కర్రలు, రాళ్ల,కుర్చీలతో దాడి చేసుకున్నారు రెండు వర్గాలు. ఫ్లెక్సీలు చించిపడేశారు. పళనిస్వామి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు పన్నీర్ సెల్వం వర్గీయులు. దీంతో పార్టీ ఆఫీసు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

Tags

Read MoreRead Less
Next Story