Indore Congress Candidate: చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్​డ్రా- వెంటనే బీజేపీలో ..

Indore Congress Candidate: చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్​డ్రా- వెంటనే బీజేపీలో  ..
ఇండోర్‌లోనూ సూరత్‌ లాగే

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్‌ తగిలింది. ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవడంతో, ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా.. ఈసారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏకంగా కాంగ్రెస్‌ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకొన్నారు. నామినేషన్ల విత్‌డ్రాకు చివరి రోజైన సోమవారం అక్షయ్‌ కాంతి బామ్‌ తన నామినేషన్‌ను వెనక్కు తీసుకోవడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఇండోర్‌ కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి ఆశిష్‌ సింగ్‌ కూడా ధ్రువీకరించారు. అక్షయ్‌ కాంతి బామ్‌తో సహా ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ ఉపసంహరించుకొన్నారని తెలిపారు. ఈ అనూహ్య పరిణామం వెనుక బీజేపీ స్కెచ్‌ ఉన్నట్టు తెలుస్తున్నది. నామినేషన్‌ పత్రాలను ఉపసంహరించుకొనేందుకు బీజేపీ నేతలతో కలిసి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన అక్షయ్‌ కాంతి.. ఆ తర్వాత నేరుగా బీజేపీ కార్యాలయానికి చేరుకొన్నారు. అనంతరం ఆ పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం జగదీశ్‌ దేవడా, మంత్రి కైలాశ్‌ విజయ్‌వర్గీయ, ఇతర పార్టీ నేతలతో కలిసి అక్షయ్‌ కాంతి దిగిన ఫొటోలను బీజేపీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇండోర్‌ లోక్‌సభ స్థానానికి నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 13న పోలింగ్‌ జరుగాల్సి ఉన్నది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ పోటీచేస్తున్నారు. ఇండోర్‌ లోక్‌సభ స్థానంలో మొత్తంగా కాంగ్రెస్‌ అభ్యర్థితో సహా తొమ్మిది మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా, బీజేపీ అభ్యర్థితో సహా 14 మంది ఎన్నికల బరిలో నిలిచారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌ కాంతి నామినేషన్‌ ఉపసంహరణ ఎపిసోడ్‌ను బీజేపీ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి కైలాశ్‌ విజయ్‌వర్గీయ నడిపించినట్టు తెలుస్తున్నది. అంతకుముందు నామినేషన్‌ను పత్రాలు వెనక్కు తీసుకొనేందుకు అక్షయ్‌ కాంతి బామ్‌.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్‌ మెందోలాతో కలిసి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారు. విజయవర్గీయకు మెందోలా అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అనంతరం అక్షయ్‌ కాంతి బామ్‌ తమతో కలసి ఓ కారులో కలిసి కూర్చొన్న ఫొటోను విజయవర్గీయ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో స్థానిక పత్రాకర్‌ కాలనీలోని అక్షయ్‌ కాంతి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story