Manipur : బయట పడిన మరో ఘోరం

Manipur : బయట పడిన మరో ఘోరం
కౌన్సిలింగ్ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

మణిపూర్‌లో శాంతిభద్రతలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న క్రమంలో అప్పట్లో జరిగిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎప్పుడో జరిగిన ఘోరం ఇప్పటికీ తనను వెంటాడుతూ ఉందదంటున్న ఓ మహిళ కౌన్సిలింగ్ తర్వాత బయట పెట్టిన నిజాలు పోలీసులు సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. చురాచందాపూర్‌ జిల్లాలో కొందరు దుండగుల చేతుల్లో ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. అత్యంత పాశవికంగా వేధిస్తూ మరీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు వాళ్లు. ఈ క్రమంలో బయటికి చెప్పుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతో ఇన్నాళ్లూ ఆమె మౌనంగా ఉండిపోయింది. అయితే ఆ లైంగిక దాడి తర్వాత ఆమె ఆరోగ్యంగా బాగా దెబ్బతింది. ఆమె మంగళవారం ఓ ప్రభుత్వాసుపత్రిని సందర్శించగా.. అక్కడి వైద్యులు జరిగిందంతా తెలుసుకుని ఆమెకు వైద్యంతో పాటు మనోధైర్యం అందించారు. ఆపై బుధవారం ఆమె బిష్ణుపూర్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


మే 3వ తేదీ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఆమె ఇంటిని కొందరు దుండగులు తగలబెట్టారు. ఈ క్రమంలో ఆమె ఇద్దరు కొడుకుల్ని, భర్తకు సోదరి మరో మహిళ, ఆమె ఇద్దరు బిడ్డలతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే బాధితురాలు పిల్లాడిని ఎత్తుకొని ఉండటంతో పరిగెత్తు లేక కింద పడిపోయింది. ముందు మరో చంటిబిడ్డతో పరిగెడుతున్న మహిళను పిలిచి నలుగురి పిల్లల్ని ఆమెకే ఇచ్చి వెళ్లిపోమని చెప్పింది. కిందపడ్డ బాధితురాలోని ఐదారుగురు దుండగులు చుట్టుముట్టారు. పిల్లలు అరుస్తూ, ఆమె వైపు చూస్తూనే పారిపోగా, దుండగులు ఆమెపై లైంగిక దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన ఆమె.. ఆ తర్వాత శరణార్థ శిబిరంలో ఉన్న కుటుంబ సభ్యులను చేరుకున్నప్పటికీ మానసికంగా తేరుకోలేకపోయింది. ఆత్మహత్య ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆరోగ్యం దిగజారడంతో వైద్యుల్ని సంప్రదించగా వాళ్లకు అనుమానం వచ్చి ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు బయట పెట్టింది. వాళ్ల సలహా, కౌన్సిలింగ్ లతో ధైర్యం తెచ్చుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే.. మణిపూర్‌ అల్లర్లు-హింస కారణంగా మే 3వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకు 6,500దాకా కేసులు నమోదు చేసినట్లు మణిపూర్‌పోలీస్‌ శాఖ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. అయితే వీటిలో ఇళ్లు, ఆస్తుల ధ్వంసం కేసులే ఎక్కువగా ఉన్నట్లు సుప్రీంకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. కానీ పోలీస్‌ శాఖ వివరణతో సంతృప్తి చెందని సుప్రీం.. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో కేసుల విచారణ జరిపించాలని మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఆదేశిచింది.

Tags

Read MoreRead Less
Next Story