Model code of conduct: ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక ఏం చేయాలి ?

Model code of conduct: ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక ఏం చేయాలి ?
ఏపీ ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల వద్ద ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు, గోడపత్రికలు, కటౌట్‌లు తొలగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రహదారులు, బస్సులపైనా రాజకీయ నేతల ప్రకటనల పోస్టర్లు తొలగించాల్సిందిగా.. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే... ప్రభుత్వ శాఖల అధికారిక వెబ్ సైట్లలోనూ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫొటోలను తీసేయాలని స్పష్టం చేశారు. ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు కూడా నిలిపివేయాల్సిందిగా సూచించారు. ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు, అధికారయంత్రాంగం బదిలీలపై పూర్తి నిషేధం అమలు అవుతుందని... ఈసీ స్పష్టం చేసింది. మంత్రులతో... అధికారుల వీడియో కాన్ఫరెన్సులపైనా పూర్తి నిషేధం వర్తిస్తుందని ఈసీ తేల్చిచెప్పింది. అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ఆయా ప్రభుత్వ విభాగాలను.. ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలపై సీఎం ఫొటోలు ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మంత్రులకు... ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపివేయాలని ఆదేశించారు. పైలట్ కార్లు, సైరన్ వినియోగించకూడదని షరతులు విధించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అతిథి గృహాలను ఖాళీ చేయించాలని వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ తేల్చి చెప్పింది. సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, HODలు, కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీలకు... ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మార్గదర్శకాలు జారీ చేశారు.


లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు నేడే నగారా మోగనుంది.ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ అధికారికంగా ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరుగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తోంది. ఈలోగానే కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. గత ఎన్నికల సమయంలో మార్చ్ 10న షెడ్యూల్ విడుదలయింది. ఏప్రిల్ 11 నుంచి ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. మరోవైపు రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో... రేపటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

Tags

Read MoreRead Less
Next Story