Ashok Gehlat: అత్యాచార నిందితులకు ప్రభుత్వ ఉద్యోగం లేదు

Ashok Gehlat: అత్యాచార నిందితులకు ప్రభుత్వ ఉద్యోగం లేదు
రాజస్థాన్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

కొత్త కొత్త చట్టాలు, కఠినమైన చర్యలు ఏవి కూడా మహిళలపై అఘాయిత్యాలను ఆపలేక పోతున్నాయి. జైల్లో వేస్తారన్న భయం, తరువాత ఏం జరుగుతుందో అన్న ఆలోచన ఉండకపోవడంతో అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే మహిళలపై వేధింపులకు పాల్పడుతారో, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయాలని నిర్ణయించారు. మహిళలపై నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

సీఎం అశోక్ గెహ్లాట్ రాజస్థాన్‌లోని శాంతిభద్రతల పరిస్థితిపై ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. చట్టాన్ని ఉల్లంఘించిన వారి రికార్డును ఉంచాలని కోరారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకోవచ్చని సూచించారు. మహిళలను వేధించే పోకిరీలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు. వారి పేర్లను స్టాఫ్ సెలక్షన్ బోర్డు, రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌తో పంచుకోవటం ద్వారా వీరు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు గుర్తించడానికి వీలవుతుందన్నారు. అలాగే వారి క్యారెక్టర్ సర్టిఫికేట్‌లలో వేధింపులకు పాల్పడ్డారని మెన్షన్ చేయబడుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్‌లో లైంగిక నేరస్థుల జాబితాను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యోగానికి ఎంపిక చేసేముందు స్థానిక పోలీస్ స్టేషన్లు లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నడవడిక ధ్రవపత్రాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

అలాగే నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచే బార్‌లు, నైట్‌క్లబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు.. వారి లైసెన్సులను రద్దు చేస్తామని చెప్పారు. రాజస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో గెహ్లాట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story