Gyanvapi: జ్ఞానవాపీలో శాస్త్రియ సర్వే షురూ...

Gyanvapi: జ్ఞానవాపీలో శాస్త్రియ సర్వే షురూ...
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే ప్రారంభించిన ఆర్కియాలజీ సంస్థ... ఏడు గంటలకే ప్రారంభమైన సర్వే...

వారణాసి జ్ఞానవాపి మసీద్‌లో భారత పురావస్తు పరిశోధనా సంస్థ (Archaeological Survey of India) శాస్త్రీయ సర్వే((scientific survey) మొదలైంది. సోమవారం ఉదయం నుంచే ఈ సర్వే జరగనుందని వారణాసి జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేయగా దానికి తగ్గట్లే 30 మంది ASI అధికారుల బృందం సర్వేను ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. సీల్‌ వేసిన వాజూ ఖానా మినహా మిగిలిన మసీదునంతా భారత పురావస్తు పరిశోధనా సంస్థ అధికారులు సర్వే చేయనున్నారు. ఉదయం 7 గంటలకు ASI బృందం మసీదులోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు. వీరితో పాటు హిందూ పిటిషనర్లందరీ న్యాయవాదులు కూడా ఘటన స్థలంలో ఉన్నారని న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు. ఆదివారం సాయంత్రమే ASI బృందం వారణాసికి చేరుకుంది. సర్వే నేపథ్యంలో వారణాసి పోలీస్ కమిషనర్ అశోక్ ముతా జైన్ హిందూ, ముస్లిం సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. సర్వే త్వరగతిన పూర్తి చేసిన ఆగష్టు 4వ తేదీన జిల్లా న్యాయస్థానానికి ఏఎస్‌ఐ తన నివేదికను అందించనుంది.


జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొందరు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు వారణాసి కోర్టు( (Varanasi Court) ఆ ప్రార్థనా స్థలంలో గతంలో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించింది. సర్వే కొనసాగుతుండగా అక్కడ శివలింగం ఆకారం కనిపించడం కలకలం రేపింది. అది శివలింగమని హిందూ సంఘాలు, నీటి కొలను నిర్మాణమని మసీదు కమిటీ పరస్పరం వాదించుకుంటున్నాయి. జ్ఞానవాపి మసీదు(జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque)లో శివలింగం కనిపించిందంటూ హిందూ పక్షం వేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాలని, సీఆర్పీఎఫ్‌ భద్రతలో ఉంచాలని ఉత్తర్వులిచ్చింది.


ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని ఆదేశాలిచ్చింది. అయితే, ఈ కేసు సున్నితత్వం దృష్ట్యా సీనియర్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ అంశంపై వారణాసి కోర్టులో విచారణ జరుగుతుండగా.. హిందూ భక్తులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ మసీదు ప్రాంగణమంతా ఏఎస్‌ఐతో సర్వే చేయించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఇటువంటి సర్వే వల్ల మసీదు ప్రాంగణం ధ్వంసమయ్యే అవకాశం ఉందని ముస్లింల ప్రతినిధులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న వారణాసి కోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీజ్‌ చేసిన ప్రాంతం మినహా మిగతా మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే చేసేందుకు అంగీకరించింది.

శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టాలని కోరింది. ఈ పిటిషన్‌ ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story