Muslim Marriage Law: అస్సాంలో ముస్లిం వివాహ చట్టం రద్దు!

Muslim Marriage Law: అస్సాంలో ముస్లిం వివాహ చట్టం రద్దు!
బాల్య వివాహాలను అంతం చేసే ప్రయత్నంలో భాగమే

అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్‌కిపెద్దపీట వేస్తూ.. ముస్లింలలో వివాహాలు & విడాకులను నియంత్రించే వ్యక్తిగత చట్టాన్ని రద్దు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో యూసీసీ చట్టాన్ని ఉత్తరాఖండ్ ఆమోదించగా, అస్సాం కూడా ఇలాంటి చట్టాన్నే తీసుకురావాలని భావించింది. ఫిబ్రవరి 28వ తేదీతో ముగిసే బడ్జెట్ సెషన్‌లో అస్సాం ప్రభుత్వం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అస్సాం మంత్రి జయంత మల్లా బారుహ్ మాట్లాడుతూ.. ముస్లిం వివాహాలు & విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అలాంటి విషయాలను ‘ప్రత్యేక వివాహ చట్టం’ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం కోరుకుంటోందని స్పష్టం చేశారు.

బాల్య వివాహాలకు అంతం పలకడానికే ఈ చర్య తీసుకున్నట్టు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. చట్ట ప్రకారం పురుషులకు 21, స్త్రీలకు 18 ఏండ్లు నిండితేనే వివాహానికి అర్హులని, అయితే ఇంతవరకు ఉన్న చట్టం ప్రకారం వారికి ఆ వయసు లేనప్పటికీ వివాహ నమోదుకు అంగీకరించేవారని, దీంతో బాల్య వివాహాలకు ఊతమిచ్చినట్టయ్యిందని ఆయన తెలిపారు. తాము తీసుకున్న ముఖ్యమైన ఈ నిర్ణయంతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. ప్రస్తుతమున్న 94 ముస్లిం వివాహ రిజిస్ట్రార్‌లు అస్సాం ఐజీపీ (రిజిస్ట్రేషన్‌) పరిధిలోకి వస్తారని చెప్పారు. వారంతా శుక్రవారం నుంచే రద్దు అయ్యారని వెల్లడించారు. ఇకపై ముస్లింల వివాహాలు, విడాకుల నమోదును జిల్లా కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ చేపడతారని మంత్రి వివరించారు. 94 మంది ముస్లిం రిజిస్ట్రార్లకు ఒక్కొక్కరికి ఏకమొత్తంలో రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి విధుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. కాగా ముస్లిం వివాహ చట్టం రద్దుతో సంబంధిత అంశాలు ప్రత్యేక వివాహ చట్టం పరిధిలోకి రానున్నాయి.

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు ఖండించాయి. ఇది ముస్లింల పట్ల వివక్షాపూరితంగా ఉందని, ఎన్నికల సమయంలో ఓటర్ల ప్రలోభానికి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించాయి.

Tags

Read MoreRead Less
Next Story