Ayodhya Rama Mandiram : ఆహ్లాదకరంగా రామ మందిర పరిసరాలు , రోడ్లపై సూర్య స్తంభాలు

మున్సిపాలిటీపై ఆధారపడకుండా ప్రత్యేక ఏర్పాటు

అయోధ్యలో రామ మందిర పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండనున్నాయి. ఆలయ కాంప్లెక్స్‌ ఆత్మనిర్భర్‌గా ఉండేలా ట్రస్ట్‌ అన్ని జాగ్రత్తుల తీసుకుంటోంది. మురుగునీటి నిర్వహణ నుంచి విద్యుత్‌ వరకు మున్సిపాలిటీపై ఆధారపడకుండా ఆలయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.

అయోధ్యలోని రామ మందిర పరిసరాలు ఎక్కువ భాగం పచ్చదనంతో నిండి ఉంటాయని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్ తెలిపారు. 70 ఎకరాల్లో 70 శాతం చెట్లు, మెుక్కలతోనే విస్తరించి ఉంటుందని పేర్కొన్నారు. ఇందు కోసం 600 చెట్లను గ్రీన్‌ బెల్ట్‌లో సంరక్షిస్తున్నామని చెప్పారు. పచ్చదనంలో ఎక్కువ భాగం చెట్లే ఉంటాయని సూర్యరశ్మి కూడా ఫిల్టర్‌ అయ్యేలా ఉంటుందన్నారు. ఆలయ కాంప్లెక్స్‌ ఆత్మనిర్భర్‌గా ఉంటుందని వెల్లడించారు. ఆలయ అవసరాల కోసం ప్రత్యేక నీటి శుద్ధీకరణ ప్లాంటులు, సొంత డ్రైనేజీ, విద్యుత్‌ వ్యవస్థ, నీళ్ల కోసం అండర్‌ గ్రౌండ్‌ రిజర్వాయర్ ఉంటాయని వివరించారు. డ్రైనేజీ, మురుగునీటి నిర్వహణ సేవల కోసం అయోధ్య మున్సిపాలిటీపై భారం మోపమని వ్యాఖ్యానించారు. ఆలయ కాంప్లెక్స్‌లో రెండు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌లు, ఒక వాటర్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, విద్యుత్‌ కోసం ప్రత్యేక లైన్లు ఉంటాయని చెప్పారు. మెుదటి దశ ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోగా...జనవరి 22వ తేదీన రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.


ఆలయానికి వచ్చే సందర్శకులు తూర్పు వైపున ఉన్న 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయానికి చేరుకుంటారని చంపత్‌ రాయ్ తెలిపారు. సాంప్రదాయ నాగర శైలిలో నిర్మిస్తున్న ఆలయ సముదాయం తూర్పు-పడమర దిశలో 380 అడుగుల పొడవు , 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఉంటుందని వెల్లడించారు. ఆలయ అంతస్తులు ఒక్కొక్కటి 20 అడుగుల పొడవుతో ఉంటాయని వివరించారు. ఒక్కొక్క అంతస్తులో 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ర్యాంపులు ఉంటాయని తెలిపారు. 25 వేల మంది భక్తులు తమ సెల్‌ఫోన్లు, పాదరక్షలు, చేతి గడియారాలు భద్రపరుచుకునేందుకు వీలుగా పెద్ద సముదాయం ఉంటుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు భక్తులు త్వరగా బయటపడేందుకు ప్రత్యేక దారిని కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. అయోధ్య ఆలయం దీర్ఘచతురస్ర ఆకారంలో చుట్టుకొలత కలిగి ఉంటుంది. ఇలాంటి ఆలయాలు ఎక్కువగా దక్షిణభారత దేశంలో దర్శనమిస్తాయి. దీర్ఘచతురస్ర ఆకారంలో ఒక్కో మూలను సూర్యుడు, మా భగవతి, గణేష్‌, శివునికి అంకితమిస్తారు. ఉత్తరాన అన్నపూర్ణ ఆలయం, దక్షిణాన హనుమంతుడి ఆలయం ఉంటాయి. ఆలయ కాంప్లెక్స్‌లో మరో ఏడు గుడులు ఉంటాయి.


సూర్యుని ఇతివృత్తంతో రూపొందించిన 40 సూర్య స్తంభాలను గుడికి చేరుకునే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు. 30 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్తంభాలపై అలంకారప్రాయంగా ఒక గోళాకారాన్ని ఉంచారు. రాత్రిపూట దీనిని వెలిగించినప్పుడు సూర్యుని పోలి ఉంటుంది. లతా మంగేష్కర్‌ చౌక్‌ను కలిపే థర్మపథ్‌లో అయోధ్య బైపాస్‌ సమీపంలోని నయాఘాట్‌ వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story