Ayodhya: అయోధ్య ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక

Ayodhya: అయోధ్య ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక
సర్వాంగ సుందరంగా

చరిత్రాత్మక ఘట్టంగా నిలవనున్న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేడుకకు సర్వం సిద్ధమయింది. దేశ వ్యాప్తంగా ఉన్న విశిష్ట అతిథులకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పంపిస్తున్న ఆహ్వాన పత్రికలు చేరుతున్నాయి. చరిత్రలో నిలిచిపోనున్న అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలకు సర్వం ముస్తాబయిన వేళ .. రామ్‌జన్మభూమి ట్రస్టు ముఖ్య అతిథులకు పంపిస్తున్న ఆహ్వాన పత్రికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ ఆహ్వానపత్రికలను ట్రస్టు తాజాగా ఆవిష్కరించింది. పత్రికలపై ఉన్న అక్షరాలను దేవనగరి లిపిలో లిఖించారు. మొదటి పేజీలో అపూర్వ ఆనందిక్‌ నిమంత్రన్‌.. అంటే తెలుగులో అపూర్వమైన సంతోషకరమైన ఆహ్వానం అని రాసి ఉంది. ఆ వాక్యానికి పైభాగాన మందిర ముఖభాగాన్ని ముద్రించారు. ఆహ్వాన పత్రికను తెరవగానే.. రెండో పేజీలో అందమైన బాలరాముడి మనోహరమైన రూపాన్ని చిత్రీకరించారు.

ఇక ఆ తర్వాత పత్రికలో.. ప్రాణప్రతిష్ఠకు హాజరుకానున్న విశిష్ట అతిథుల పేర్లను అచ్చు వేయించింది రామ్‌ జన్మభూమి ట్రస్టు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆనందిబెన్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ మొదలగువారి పేర్లు అక్కడ కనిపిస్తాయి. జనవరి 22 న ఉదయం పూజ, మధ్యాహ్నం మృగశిరనక్షత్రంలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఆహ్వానపత్రికలో ఉంది. ఆహ్వాన పత్రికతో పాటు ఒక బుక్‌లెట్‌ను ట్రస్టు పంపుతోంది.


ఇక విల్లు, బాణాలు ధరించిన బాల రాముడి చిత్రాలు కూడా ఆ ఆహ్వాన పత్రికలో ఉన్నాయి. జనవరి 22 వ తేదీ ఉదయం 11:30 గంటలకు ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ పూజ ప్రారంభమవుతుందని ఆ ఆహ్వాన పత్రికలో ముద్రించారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కార్యక్రమానికి సంబంధించిన ప్రముఖ అతిథులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని అందులో పేర్కొన్నారు. ఆహ్వానం ప్రకారం.. అతిథులు బయలుదేరిన తర్వాత సాధువులు రామ్ లల్లా విగ్రహాన్ని దర్శించుకోవడం ప్రారంభిస్తారు. ఈ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌ దాస్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. రాముడు తన సొంత గొప్ప దేవాలయ స్థానానికి తిరిగి వస్తున్నాడని అందులో తెలిపారు.

ఇక 1528 నుంచి 1984 వరకు రామ మందిరం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన 76 పోరాటాల్లో పాల్గొన్న వారికి ఆహ్వాన పత్రికలోని బుక్‌లెట్‌ను అంకితం చేశారు. ఈ 76 పోరాటాల నుంచి ప్రేరణ పొంది 1984 అక్టోబర్‌లో సరయు నది ఒడ్డున 77వ పోరాటం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అతిథుల్లో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, బిలియనీర్స్ ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు ఉన్నారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల మంది సాధువులు.. రామాలయ ఉద్యమంలో మరణించిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానాలు పంపించినట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story