Ayodhya: శ్రీ వారితో పోటీ పడిన శ్రీ రాముడు

Ayodhya: శ్రీ వారితో పోటీ పడిన శ్రీ రాముడు
లక్షల్లో భక్తులు, కోట్లల్లో ఆదాయం...

అయోధ్యలో బాల రాముడి కొలువుదీరడంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు భారీగా ఆదాయం సమకూరనుంది. బాలక్‌ రామ్‌ను దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు వస్తుండటంతో పర్యాటకంగా ఉత్తర్‌ప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుందని SBI నివేదిక అంచనా వేసింది. యూపీకి ఏటా పన్నుల రూపంలో 5 వేల కోట్ల ఆదాయం చేకూరనుందని పేర్కొంది. సందర్శకుల సంఖ్య పరంగా వాటికన్ సిటీ, మక్కా నగరాలను అయోధ్య అధిగమిస్తుందని ఓ విదేశీ స్టాక్ మార్కెట్ పరిశోధన సంస్థ అంచనా వేసింది.

అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కావడంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు భారీగా లబ్ధి చేకూరనుంది. "బాలక్ రామ్" విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్యకు లక్షల్లో భక్తులు పోటెత్తడంతో యూపీ సర్కార్ ఖజానాకు ఏటా పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయంరానుందని SBI అధ్యయనంలో తేలింది. రామ మందిరంతో పాటు ఇతర పర్యాటక కేంద్రాల ద్వారా 2024-25లో ఉత్తర్‌ప్రదేశ్‌ 5 వేల కోట్ల రూపాయల వరకు పన్నులు వసూలు చేయగలదని అంచనా వేసింది. అయోధ్య ఏటా దాదాపు 5 కోట్ల మంది భక్తులను ఆకర్షిస్తుందని... ఇది యూపీలోనే కాకుండా భారత్‌లోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతుందని SBI నివేదిక అంచనా వేసింది.ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వెంకటేశ్వరస్వామి పుణ్య క్షేత్రాన్ని ఏటా 2.5 కోట్ల మంది భక్తులు సందర్శించుకుంటున్నారు. కానుకల రూపంలో 1,200 కోట్ల రూపాయల ఆదాయం తిరుపతికి వస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయాన్ని ఏటా 80 లక్షల మంది సందర్శించుకుంటుండగా 500 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఆగ్రాలోని తాజ్ మహల్‌కు ప్రతి సంవత్సరం 70 లక్షల మంది సందర్శకులు వస్తుండగా...100 కోట్ల ఆదాయం చేకూరుతోంది.


సందర్శకుల సంఖ్య పరంగా వాటికన్ సిటీ, మక్కా నగరాలను అయోధ్య అధిగమిస్తుందని విదేశీ స్టాక్ మార్కెట్ పరిశోధన సంస్థ జెఫరీస్ పేర్కొంది. మక్కాను ఏటా 2 కోట్ల మంది సందర్శించుకుంటారనీ....దీని వల్ల సౌదీ అరేబియాకు 1,200 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని తెలిపింది. వాటికన్ సిటీకి ప్రతి సంవత్సరం 90 లక్షల మంది పర్యాటకులు వస్తారనీ.....అలా ఆ దేశానికి 2,300 కోట్ల మేర ఆదాయం వస్తుందని పేర్కొంది. ఇక ప్రతి రోజూ లక్ష మందికి పైగా భక్తులు అయోధ్యను సందర్శిస్తారని ఈ సంఖ్య త్వరలోనే రోజుకు 3 లక్షలకు చేరుకోవచ్చని ఓ ప్రభుత్వ అధికారి అంచనా వేశారు. ఒక్కో భక్తుడు తమ దర్శన సమయంలో సుమారు 2 వేల 500 రూపాయలు ఖర్చు చేస్తే, అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఏకంగా 25 వేల కోట్లకు చేరుతుందని ఆయన చెప్పారు


స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, యూఏఈ వంటి దేశాలు టూరిజం ఆధారంగా సాటిలేని ఆర్థికాభివృద్ధిని సాధించాయని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవంతో భారత్ ఈ దేశాల సరసన చేరేందుకు సిద్ధంగా ఉందని అంచనా వేస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story