Bee Warriors: భారత సరిహద్దుకు రక్షకులుగా తేనెటీగలు

Bee Warriors: భారత సరిహద్దుకు రక్షకులుగా తేనెటీగలు
పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన బీఎస్‌ఎఫ్‌

బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు భారతదేశంలో సాధారణం. తరచుగా ఇలా దేశంలో చొరబడుతున్న వ్యక్తులు సరిహద్దులో పట్టుబడతారు. ఇక్కడి సరిహద్దులపై నిఘా ఉంచే బాధ్యత సరిహద్దు భద్రతా దళంపై ఉంది. ఈ నేపథ్యంలో చొరబాట్లను కట్టడిచేసేందుకు బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తేనెటీగల సాయంతో చొరబాట్లను అడ్డుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన బీఎస్‌ఎఫ్‌.. ప్రయోగం విజయవంతమైతే పెద్ద ఎత్తున తేనెటీగల పెంపకాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది.

బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి తరచూ భారత్‌లోకి చొరబాట్లు చోటుచేసుకున్నాయి. అక్రమంగా దేశంలోకి వస్తున్న వారిని సరిహద్దు భద్రతా బలగాలు నిలువరిస్తున్నప్పటికీ.. వారి కన్నుగప్పి ఏదో ఒక చోటు నుంచి దేశంలోకి చొరబడే వాళ్లు చొరబడుతూనే ఉన్నారు. అందుకే ఈ చొరబాట్ల కట్టడికి తేనెటీగలను వినియోగించుకుంటే బాగుంటుందేమోనని బీఎస్‌ఎఫ్‌ ప్లాన్‌ చేసింది. ప్లాన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఇప్పటికే బార్డర్‌లో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించింది.

పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా బీఎస్ఎఫ్ భారత్-బంగ్లాదేశ్ మధ్య 4.96 కిలోమీటర్ల పొడవున ముళ్ల కంచెను ఏర్పాటు చేసింది. ఈ ముళ్ల కంచె వెంబడి బాక్సులను ఏర్పాటు చేసి వాటిలో తేనెటీగలను పెంచాలని బీఎస్‌ఎఫ్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకోసం తేనెటీగలకు అవసరమైన మకరందాన్ని ఇచ్చే కొన్ని రకాల పూల మొక్కలను ఆ ముళ్ల కంచెలో పెంచుతున్నారు. తేనెటీగలకు ఉపయోగపడే సహజ వాతావరణాన్ని సరిహద్దులో సృష్టిస్తున్నారు.


కాగా భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంట ముళ్ల కంచె మీద ఏర్పాటు చేసే ఈ బాక్సుల నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామాల ప్రజలకు అప్పగించనున్నట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. ఆయా బాక్సులలో తేనెటీగలు నిలువచేసే తేనెను సేకరించుకునే అవకాశాన్ని కూడా వారికే కల్పించనున్నామని చెప్పారు. ఈ వినూత్న పద్ధతిని అమలు చేయడానికి పెద్దగా ఖర్చు ఉండదని, పైగా తేనె సేకరణ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకు ఆదాయం వస్తుందని అంటున్నారు.

సరిహద్దుల్లోని ముళ్ల కంచె వెంట తేనేతీగలను పెంచే బాక్సులను ఉంచడంవల్ల చొరబాటుదారులు ముళ్లకంచెను తాకగానే అది ఊగుతుందని, దాంతో ఆ బాక్సుల్లోని తేనేటీగలు బయటికి వచ్చి చొరబాటుదారులను తరిమేస్తాయని బీఎస్‌ఎఫ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాబోయే రోజుల్లో మిగతా సరిహద్దుల్లోనూ తేనెటీగల రక్షణ ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story