Shahjahan Sheikh: సీబీఐ కస్టడీకి షాజహాన్‌ షేక్‌

Shahjahan Sheikh: సీబీఐ కస్టడీకి షాజహాన్‌ షేక్‌
రెండు రోజుల హైడ్రామా అనంతరం

టీఎంసీ నాయకుడు, సందేశ్‌ఖలీ కేసులో ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్‌ను సీబీఐ కస్టడీకి తీసుకుంది. బెంగాల్‌ సీఐడీ పోలీసులు... అతనికి వైద్య పరీక్షల నిర్వహించి.. ఆ తర్వత సీబీఐకి అప్పగించారు. కోల్‌కతా హైకోర్టు హెచ్చరికలతో... షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించారు బెంగాల్‌ పోలీసులు. దీంతో రెండు రోజుల హైడ్రామాకు ఫుల్‌స్టాప్‌ పడింది.

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. సందేశ్‌ఖాలీ కేసులో కలకత్తా హైకోర్టు బెంగాల్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం సాయంత్రం 4గంటల 15నిమిషాల్లోగా.. నిందితుడు షాజహాన్ షేక్‌ను, సందేశ్‌ఖాలీ కేసు వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాల్సిందే అంటూ డెడ్‌లైన్‌ పెట్టింది ధర్మాసనం. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు షాజహాన్‌ షేక్‌తోపాటు కేసు పత్రాలను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించారు బెంగాల్‌ పోలీసులు. దీంతో.. రెండు రోజులుగా పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం, కేంద్ర ఏజెన్సీల మధ్య కొనసాగిన హైడ్రామాకు తెరపడింది.

షాజహాన్‌ షేక్‌ అకృత్యాలు..

సందేశ్‌ఖాలీలో దోపిడీ, భూకబ్జాలు, లైంగిక వేధింపుల కేసుల్లో షాజహాన్‌ షేక్‌ కీలక నిందితుడిగా ఉన్నాడు. అతను, అతని మద్దతుదారులు.. సందేశ్‌ఖాలీలోని టీఎంసీ కార్యాలయంలో మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు... రేషన్‌ కుంభకోణం కేసులో విచారణకు వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై షాజహాన్‌ షేక్‌ అనుచరులు దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి... జనవరి 5వ తేదీన జరిగింది. ఫిబ్రవరి 18న.. షాజహాన్, అతని మద్దతుదారులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ... సందేశ్‌ఖాలీలోని పలువురు మహిళలు చీపుర్లు, కర్రలతో నిరసన తెలిపారు.

5 ఏళ్ల షాజహాన్‌ కూలీ నుంచి రాజకీయ నేతగా ఎదిగాడు. సందేశ్‌ఖాలీలో అతన్ని అందరూ భాయ్ అని పిలుస్తుంటారు. 2013లో టీఎంసీలో చేరారు షేక్‌. టీఎంసీ విభాగ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. స్థానికంగా ఎంపీ, ఎమ్మెల్యే కంటే బాగా బలమున్న నేత. మాజీ మంత్రి జ్యోతిప్రియో మాలిక్‌కు సన్నిహితుడు. సందేశ్‌ఖాలీలో దశాబ్దాల పాటు బలమైన నేతగా ఎదిగిన షాజహాన్‌.. అక్కడి ప్రజలను శాసిస్తూ ఉంటాడు. స్థానికుల నుంచి భూములను లాక్కోవడం.. ఇవ్వకపోతే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం.. వంటి ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగా అతడి పలుకుబడి చూసి ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఇటీవల ఈడీ దాడుల తర్వాత.. కొంతమంది మహిళా బాధితులు షాజహాన్‌ను అరెస్టు చేయాలంటూ రోడ్డెక్కారు. దీంతో అతని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story