పశ్చిమ బెంగాల్లో రీ పోలింగ్‌

పశ్చిమ బెంగాల్లో రీ పోలింగ్‌
పశ్చిమ బెంగాల్లో 697 కేంద్రాల్లో రీ పోలింగ్‌.... హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ నిర్ణయం... పటిష్ట భద్రత మధ్య పోలింగ్‌...

పశ్చిమ బెంగాల్లో 19 జిల్లాల్లోని 697ఎన్నికల కేంద్రాల్లో రీ పోలింగ్ ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో హింసపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. దొంగ ఓట్లు, హింసకు సంబంధించిన నివేదికలను పరిశీలించి ఈ కేంద్రాల్ల రీ పోలింగ్‌ జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. రీపోలింగ్ ప్రకటించిన జిల్లాల్లో ముర్షిదాబాద్‌లో అత్యధికంగా 174 బూత్‌లు ఉండగా... మాల్దా 110 బూత్‌లు ఉన్నాయి. రీపోలింగ్ జరిగే కేంద్రాల వద్ద రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలకు చెందిన నలుగురు చొప్పున విధుల్లో ఉంటారని ఈసీ పేర్కొంది.


పోలింగ్‌ రోజు వివిధ పార్టీలకు చెందిన 15 మంది మరణించారు. టీఎంసీకి చెందినవారు 12మంది చనిపోగా కాంగ్రెస్‌, భాజపా, CPM మద్దతుదారులు ఒక్కొక్కరు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 2018 పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో హింస మరింత ఎక్కువైంది. 2018లో పోలింగ్ రోజున 10 మంది ప్రాణాలు కోల్పోగా ఈసారి పోలింగ్ రోజుహింసలో వివిధ పార్టీలకు చెందిన 15 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, మొత్తం 19 మంది చనిపోయారని అనధికారిక లెక్కలు చెప్తున్నాయి. బాంబు దాడులు, తుపాకీ కాల్పుల కారణంగానే వీరిలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.


పంచాయతీ ఎన్నికల వేళ హింసపై సమగ్ర నివేదిక పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలతోపాటు పోలింగ్‌ సందర్భంగా అక్రమాలను నిరసిస్తూ నిన్న పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. భాజపా, కాంగ్రెస్‌ కార్యకర్తలు పలుచోట్ల ఆందోళన చేపట్టగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

హింసకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామని, కోర్టుకు కూడా వెళ్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం కుట్ర పూరితంగా కేంద్ర బలగాలు కోరి తృణమూల్ కాంగ్రెస్ నేతలను చంపుతున్నాయని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరోపించింది. పంచాయతీ ఎన్నికల హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక ఇచ్చేందుకు బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఢిల్లీకి చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story