Bengaluru water crisis : నీటి సమస్యలతో బెంగుళూరు వాసులకు కన్నీరు

Bengaluru water crisis : నీటి సమస్యలతో బెంగుళూరు వాసులకు  కన్నీరు
నెలకు ఐదు సార్లే స్నానం.. వంట వండుకోకుండా ఫుడ్‌ ఆర్డర్‌

బెంగళూరు నీటి సంక్షోభం.. రోజురోజుకు పెరిగిపోతోంది! వేసవి కాలంలో నీరు దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. వీటన్నింటి మధ్య సిలికాన్​ వ్యాలీ ఆఫ్​ ఇండియాగా పేరొందిన బెంగళూరును టెక్​ ఉద్యోగులు వదిలేసి వెళ్లిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. నీటి సంక్షోభంతో.. బెంగళూరులో జీవించడం చాలా కష్టంగా ఉందని సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. చాలా వరకు కంపెనీల్లో వర్క్​ ఫ్రం హోం ఆప్షన్​ని ఎత్తివేయడంతో ఉద్యోగుల పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది.

తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగానే బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. అటు నగర జలమండలి కూడా సరిపడా నీటిని సరఫరా చేయడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి. దీంతో డిమాండ్‌ ఎక్కువవడంతో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు.

నగరంలో రోజుకు 2,600-2,800 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి అవసరం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,300 ఎంఎల్‌డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు. మరోవైపు ఎండాకాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోవు రోజుల్లో పరిస్థితి ఇంకా ఎంత స్థాయికి దిగజారుతుందోనని నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ప్రతి నీటి బొట్టును వృథాగా పోకుండా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఎండాకాలం అయినప్పటికీ నెలకు ఐదు సార్లు మాత్రమే స్నానాలు చేస్తున్నామని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వంట వండటం, గిన్నెలు తోమడం వంటి వాటికి నీరు ఎక్కువగా అవసరం ఉండటంతో.. ఫుడ్‌ను బయట నుంచి ఆర్డర్‌ పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. నివాసితులు ఎక్కువగా ఉన్న కమ్యూనిటీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోజుకు నాలుగు నుంచి ఐదు ట్యాంకులు అవసరం ఉండగా.. ఒకటి లేదా రెండు ట్యాంకులు మాత్రమే సరఫరా అవుతున్నాయి. దీంతో గత మూడు నెలలుగా తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కమ్యూనిటీల్లో నివసించే ప్రజలు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story