డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ : రైతుసంఘాల ప్రకటన

డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ : రైతుసంఘాల ప్రకటన
కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించక పోవడంతో..

కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించక పోవడంతో డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ నిర్వహిస్తామని రైతుసంఘాలు ప్రకటించాయి. ఆందోళనలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని రహదారులను అడ్డుకునే ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుసంఘాలు గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనాలని ఢిల్లీ –ఘయాబాద్‌ సరిహద్దులో ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ పిలుపునిచ్చారు. మరోవైపు భారత ప్రభుత్వ సవరణను అంగీకరించే ప్రసక్తిలేదని కిసాన్‌ సభ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లాహ్‌ తెలిపారు. రైతు ఉద్యమాన్ని పంజాబ్‌ ఉద్యమం అని మాత్రమే ప్రచారం చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతోందని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పరిస్థితుల్లో, ఉద్యమం మరింత దూకుడుగా జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

ఇవాళ మరోసారి రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ ....ఈ చర్చల్లో ఏదో ఒకటి తేలిపోవచ్చని తెలిపారు. అటు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘమైన భారతీయ కిసాన్‌ సంఘ్‌ కూడా రైతుల డిమాండ్లకు మద్దతు పలికింది. రైతు సమస్యల పరిష్కారానికి రైతు కోర్టులను ఏర్పాటుచేయాలి తప్ప ఎస్‌డీఎం కోర్టుల్లో కాదని కూడా కోరారు.

రైతులను అక్కడి నుంచి తొలగించేట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. నిరసనల వల్ల ఢిల్లీలో కరోనా విజృంభించొచ్చని పిల్‌ వేసిన న్యాయవాది ఓం ప్రకాశ్‌ పరిహార్‌ పేర్కొన్నారు. బురారీ గ్రౌండ్స్‌లో నిరసన జరిపేందుకు ప్రభుత్వం అనుమతించిందని, అక్కడికి తరలించాలన్నారు. ఇదిలా ఉండగా... రైతుల నిరసనలు 9వ రోజుకు కొనసాగుతున్నాయి. ఎముకలను కొరికే చలిలో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. సింఘూ, టిక్రీ, గాజీపూర్‌, నోయిడా సరిహద్దుల్లో రహదారులపై రైతులు నిరసనలు సాగిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story