Surat : ఎన్నికలు జరగకుండానే ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి

Surat : ఎన్నికలు జరగకుండానే ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి
లోక్‌సభ సీటు ఏకగ్రీవం 12 ఏండ్లలో తొలిసారి

ఎన్నికలు జరగకుండానే గుజరాత్‌లోని సూరత్ బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఎంపీగా గెలిచారు. ఏకగ్రీవంగా ఆయన గెలిచారని నిర్థారిస్తూ ఎన్నికల అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. సూరత్ నుంచి ప్రధాన పోటీదారు, కాంగ్రెస్‌కు చెందిన నీలేశ్ కుంబానీ నామినేషన్ పత్రాలపై చేసిన సంతకంలో తేడా ఉందని ఆయన నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు.

బీజేపీ అభ్యర్థి తప్ప మిగిలిన అభ్యర్థులందరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖేశ్ దలాల్ ఒక్కరే పోటీలో మిగలడంతో ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడాల్సి ఉంది. అప్పుడే గుజరాత్‌లో బీజేపీ తొలి విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుజరాత్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తులో పోటీ చేస్తున్నాయి. దేశంలో ఇప్పటికే ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరిగింది. రెండో విడత పోలింగ్ ఈ నెల 26వ తేదీన 89 స్థానాలకు జరగనుంది.

బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ మండిపడ్డారు. భారత ఎన్నికల ప్రక్రియకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్నో మ్యాచ్‌ ఫిక్సింగ్‌గా అభివర్ణించారు. చివరి రోజున అనూహ్యంగా అందరూ బరిలో నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం, కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం కుట్రగా కనిపిస్తున్నదని సోషల్‌మీడియాలో పలువురు కామెంట్లు పెట్టారు.

ప్రజాప్రతినిధులు ఏకగ్రీవమవ్వడమనేది గతంలో కూడా జరిగింది. 1951ఎన్నికల నుంచి ఇప్పటివరకూ 35 మంది ఎంపీలు, 298 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవమయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. జమ్ముకశ్మీర్‌ నుంచి అత్యధికంగా నలుగురు ఎంపీలు, నాగాలాండ్‌ నుంచి ఏకంగా 77 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవమయ్యారు. ఎంపీగా ఏకగ్రీవమైన వారిలో మాజీ ఉప ప్రధాని వైబీ చవాన్‌ (నాసిక్‌), ఫరూఖ్‌ అబ్దుల్లా (శ్రీనగర్‌), టీటీ కృష్ణమాచారి (తిరుచెందూర్‌), మాజీ కేంద్రమంత్రులు పీఎం సయీద్‌ (లక్షద్వీప్‌), కేఎల్‌ రావు (విజయవాడ), ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ (కన్నౌజ్‌) వంటి ప్రముఖులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story