బీజేపీ మేనిఫెస్టోలో ఉచిత వ్యాక్సిన్‌ హామీ

బీజేపీ మేనిఫెస్టోలో ఉచిత వ్యాక్సిన్‌ హామీ
బీహార్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు వారి మేనిఫెస్టోలు విడుదల చేయగా... తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్..

బీహార్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు వారి మేనిఫెస్టోలు విడుదల చేయగా... తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కరోనావైరస్ ప్రస్తావన ప్రధానంగా కనిపించింది. ఇందులో ప్రతి ఒక్కరికీ కరోనావైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 19 లక్షల కొత్త ఉద్యోగాలను రానున్న ఐదేళ్లలో కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న ఆత్మనిర్భర్ భారత్‌ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని మేనిఫెస్టోలో ప్రధానాంశంగా కనిపిస్తోంది. ఇక బీఈడీ చేసి ఉద్యోగం లేక టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి కూడా బీజేపీ గుడ్ న్యూస్ తెలిపింది. కొత్తగా 3 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు హామీ ఇచ్చింది. పేదల కోసం 30 లక్షల పక్కా ఇళ్లను 2022 నాటికి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో ఆరోగ్య రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ శాఖలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపింది.

ఇక ఎన్డీయే ప్రభుత్వంలో బీహార్‌లో జీడీపీ క్రమంగా పెరుగిందని నిర్మలా సీతారామన్ అన్నారు. 3శాతం నుంచి 11.3శాతంకు జీడీపీ పెరిగిందన్నారు. జంగల్ రాజ్ ప్రభుత్వంలో కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న 15 ఏళ్లలో జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని కేంద్రమంత్రి చెప్పారు. కేవలం ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన ఇచ్చింది కనుకే సాధ్యమైందని నిర్మలా గుర్తుచేశారు. బీహార్ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వానికి ఓటు వేసి తిరిగి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన సీతారామన్... రానున్న ఐదేళ్లకు కూడా నితీష్ కుమార్ సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. నితీష్ హయాంలోనే బీహార్‌లో అభివృద్ధివైపు దూసుకెళ్లుతుందన్న విశ్వాసాన్ని నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story