PM MODI: దేశంలో కుల, మతతత్వాలకు చోటు లేదు

PM MODI: దేశంలో కుల, మతతత్వాలకు చోటు లేదు
ఇది నైపుణ్యాల భారత్‌.... 2047 కల్ల సుసంపన్న దేశంగా భారత్‌... ప్రధాని మోదీ వెల్లడి...

ఒకప్పుడు వంద కోట్ల మంది ఆకలితో ఉన్న దేశంగా మాత్రమే భారత్‌ను చూసిన ప్రపంచం నేడు 200 కోట్ల నైపుణ్య హస్తాలుగల దేశంగా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ‍(pm modi) వెల్లడించారు. లక్షలాది మంది యువత గల దేశంగా చూస్తున్నారని వెల్లడించారు. దేశంలో అవినీతి, కులతత్వం, మతతత్వానికి చోటులేదని ప్రధాని మోదీ(prime minister) స్పష్టం చేశారు. స్థిరమైన తమ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలే దేశంలో సహజసిద్ధంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేశాయని తేల్చిచెప్పారు. 9ఏళ్ల తమ ప్రభుత్వ రాజకీయ స్థిరత్వం వల్ల దేశ ఆర్థిక ప్రగతి సహజంగా సాధ్యపడిందని మోదీ వెల్లడించారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీ20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో మోదీ తెలిపారు.

భారత్‌ జీ20 అధ్యక్షత వల్ల ఎన్నో సానుకూల అంశాలు వెలుగులోకి వచ్చాయని ప్రధాని అన్నారు. వాటిలో కొన్ని తన మనసుకు దగ్గరైనవని ఆయన వివరించారు. ఇతర దేశాల ప్రతికూల ప్రభావం మనపై పడకూడదంటే కేంద్ర బ్యాంకులు తగిన సమయంలో స్పష్టమైన పాలసీలు తీసుకోవడం సహా ద్రవ్యోల్బణంపై ప్రతి దేశం తగిన కార్యాచరణ చేపట్టాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు సైతం ఆర్థిక మందగమనం, అధిక ధరలు, వృద్ధుల జనాభా పెరగడం వంటి ప్రతికూలతలను ఎదుర్కొంటుంటే భారత్ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, అత్యధిక యువత ఉన్న దేశంగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రపంచ చరిత్రలో.. చాలాకాలంగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యున్నత ఆర్థిక వ్యవస్థలో ఒకటి ఉందని మోదీ చెప్పారు.


వివిధ రకాల వలస పాలన ప్రభావంతో ప్రపంచంపై మనదైన ముద్ర తగ్గిందన్నారు. ప్రస్తుతం భారత్‌ మళ్లీ పుంజుకుందన్నారు. కేవలం దశాబ్ద కాలంలోనే. పదో పెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఐదు స్థానాలు భారత్ ఎగబాకిందన్న మోదీ భారత్‌ అంటే వ్యాపారం అని పేర్కొన్నారు. 2047 వరకూ మనకు అనేక గొప్ప అవకాశాలు ఉన్నాయన్న మోదీ.. వచ్చే వెయ్యేళ్లు గుర్తుండేలా అభివృద్ధికి పునాది వేసే అద్భుత అవకాశం ఈ యుగంలో ఉండే భారతీయులకు దక్కిందన్నారు. 2014కు ముందు స్థిరత్వంలేక అనేక ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయిన విషయాన్ని దేశం చూసిందన్నారు. కానీ గత కొన్నేళ్లుగా భాజపాకు ప్రజలు పట్టంకట్టడంతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అందువల్లే గత 9ఏళ్లుగా అనేక సంస్కరణలు తేగలిగామని వివరించారు.

ఆర్థిక, విద్య, బ్యాంకులు, డిజిటలైజేషన్, సంక్షేమం, సామాజిక రంగాల్లో సంస్కరణలు సహజసిద్ధమైన అభివృద్ధికి పునాదివేశాయని మోదీ వెల్లడించారు. భారత్‌ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడిందని...అనేక దేశాలు మన దేశ ప్రగతి గాథను దగ్గర నుంచి చూస్తున్నాయని ప్రధాని అన్నారు. భారత్‌ అభివృద్ధి కేవలం ఆకస్మికంగా వచ్చిందికాదని ప్రపంచదేశాలు గుర్తించాయని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story