BJP Meeting: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

BJP Meeting: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
5 రాష్ట్రాల ఎన్నికలపై చర్చ

దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. అన్ని పార్టీ ఎన్నికల కసరత్తులు ప్రారంభించాయి. ఇక బీజేపీ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీకి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు JP నడ్డా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. పార్టీ అభ్యర్థులు, ఎన్నికల వ్యూహాల ఖరారే లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఎన్నికల తేదీల ప్రకటనకు కొద్దిరోజుల ముందు ఈ కమిటీ భేటీ అవుతుంది.అయితే కొద్దినెలల ముందే ఈ కమిటీ సమావేశం కానుండడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఓటమి దృష్ట్యా త్వరలో జరిగే ఎన్నికల్లో రాజీలేని పోరాటం చేయాలని భాజపా భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, తెలంగాణలో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి.ఈ మూడుచోట్ల అధికారం కోసం భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మిజోరంలో అధికారంలో ఉన్నప్పటికీ, మిత్రపక్షం MNF ఇటీవల లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది.మణిపుర్‌ సమస్యను పరిష్కరించడంలో భాజపా విఫలమైందనే ఆరోపణలు చేస్తూ MNF భాజపాకు దూరంగా జరిగింది.

అధికారంలో ఉన్న మరో రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భాజపా అంచనా వస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తున్న భాజపా ఈ మేరకు వ్యూహరచనపై కసరత్తుకు సిద్ధమైంది. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లోనూ, ప్రతిపక్ష ఇండియాతో గట్టి పోటీ ఉంటుందని భాజపా అంచనా వేస్తోంది. సాయంత్రం జరిగే భేటీలో ఐదు రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థులను ముందే ప్రకటిస్తే వారు ఎన్నికలకు సన్నద్ధం కావడానికి సరిపడినంత సమయం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలు సహా, విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story