DK Shivakumar: గవర్నర్‌ పాలన పేరుతో బీజేపీ బెదిరింపులు: శివకుమార్‌

DK Shivakumar: గవర్నర్‌ పాలన పేరుతో బీజేపీ బెదిరింపులు: శివకుమార్‌
సోదరుడికి ఓటేస్తేనే నీళ్లిస్తామని డీకే బెదిరిస్తున్నారంటున్న బీజేపీ

కర్ణాటకలోని విపక్ష బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కొందరు ఇక్కడ శాంతి భద్రతలు దిగజారాయని, అందుకే గవర్నర్‌ పాలనను విధించే అవకాశం ఉందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ విషయమై తమ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గవర్నర్‌ పాలనను విధించడానికి ఆ పార్టీ డ్రామాలు ఆడుతున్నదని మండిపడ్డారు. వారి ఉద్దేశం ఏమైనా ఇక్కడ మాత్రం అది జరగదని స్పష్టం చేశారు. కాగా, గత 48 గంటల్లో రాష్ట్రంలో జరిగిన పలు నేర ఉదంతాలను బీజేపీ ప్రస్తావించింది. కాంగ్రెస్‌ పాలనలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని విమర్శించింది. దానిపై శివకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయని, ఆ విషయంలో దేశంలోనే కర్ణాటక ఉత్తమంగా ఉందని పేర్కొన్నారు.

మరోవైపు బెంగళూరు ప్రజలకు గొంతు ఎండిపోతున్న సమయంలో డిప్యూటీ సీఎం శివకుమార్‌ ఓట్ల కోసం బేరం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన సోదరుడు డీకే సురేశ్‌కు ఓటు వేస్తేనే కావేరీ జలాలను అందజేస్తామని ఓటర్లకు శివ కుమార్‌ చెప్పినట్లు బీజేపీ ఆరోపించింది.

సురేశ్‌ బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను షేర్‌ చేశారు. శివ కుమార్‌ తన సోదరుడు సురేశ్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఓ హౌసింగ్‌ సొసైటీకి వెళ్లారని తెలిపారు. “నేను బిజినెస్‌ డీల్‌ కోసం వచ్చాను. మీరు నా సోదరునికి ఓటు వేస్తే, మీకు కావేరీ నదీ జలాలు సరఫరా అయ్యేలా నేను చూస్తాను” అని శివకుమార్‌ చెప్పినట్లు ఈ వీడియోలో ఉందన్నారు.

ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారనే దానితో సంబంధం లేకుండా, ప్రజలకు సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ఓ మంత్రిగా శివ కుమార్‌కు ఉందని మాలవీయ అన్నారు. అయితే శివ కుమార్‌ నిస్సిగ్గుగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇటువంటి బెదిరింపులు, క్విడ్‌ ప్రో కో చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. బీజేపీ ఆరోపణలపై శివకుమార్‌ గురువారం స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరీ నదీ జలాలు బెంగళూరు ప్రజలకు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలను పరిష్కరించడమే తమ కర్తవ్యమని..దాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story