Uttar Pradesh : పెళ్లికొడుకు లేకుండానే పెళ్ళి

Uttar Pradesh : పెళ్లికొడుకు  లేకుండానే పెళ్ళి
యూపీలో సామూహిక వివాహాల స్కామ్‌

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ప్రభుత్వ వివాహ పథకంలో ఘరానా మోసం బయటపడింది. సామూహిక వివాహాల పథకం కింద ప్రభుత్వం అందజేసే సొమ్మును కాజేసేందుకు కేటుగాళ్లు నకిలీ పెండ్లిండ్లు నిర్వహించారు. వరుడు లేకుండానే వందలాది మహిళలు ఎవరికి వారు మెడలో దండలు వేసుకొని పెండ్లి తంతు మమ అనిపిచారు. ఆ రోజున కార్యక్రమంలో భాగంగా 568 జంటలకు పెండ్లిండ్లు జరుగ్గా.. అందులో దాదాపు 200 జంటలు నకిలీ అని తేలినట్టు అధికారులు వెల్లడించారు.

పేదల కోసం ప్రభుత్వం చేపట్టే కొన్ని పథకాలు అధికారులు దారి మళ్లించిన వార్తలు విన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో పేదింటి యువతీ యువకుల కోసం ప్రభుత్వం చేపట్టిన వివాహ పథకంలో భారీ మోసం చోటు చేసుకుంది. నకిలీ వధూవరులతో వివాహ తంతు పూర్తి చేసి ప్రభుత్వ సొమ్ము కాజేసేందుకు ప్రయత్నించిన అధికారుల భాగోతం బయటపడింది. బలియా జిల్లాలో జనవరి 25న జరిగిన కమ్యూనిటీ వెడ్డింగ్‌లో దాదాపు 568 జంటలు కనిపించారు. అయితే వారిలో కొందరిని వధూవరులుగా నటించడానికి ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వరుడు లేకుండానే వందలాదిమంది యువతులు తమ మెడలో తామే వరమాలలు వేసుకుంటూ వీడియోలో కనిపించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. ఇలా నటించేందుకు వచ్చిన మగ, ఆడవారికి రూ.500 ల నుండి, రూ.2000 చెల్లిస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

వీరిలో కొంత మంది గతంలో పెండ్లి చేసుకొన్న వారు, పిల్లలున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే కేక్తి సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరు కావడం గమనార్హం.యూపీలో సామూహిక వివాహాలు చేసుకొన్న జంటలకు ప్రభుత్వం రూ.51 వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. అమ్మాయికి రూ.35,000, పెళ్లి సామాగ్రి కోసం రూ.10,000, వేడుక ఖర్చుల కోసం రూ.6000 అందిస్తోంది. దీనికి ఆశపడి కొంత మంది ఇలా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్‌పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల వివరాలన్నీ పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తరపున వాళ్లకు ఒక్క రూపాయి కూడా అందలేదని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story