ఇకపై కూతురు కాదు కొడుకు

ఇకపై కూతురు కాదు కొడుకు
పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య కుమార్తె లింగ మార్పిడి

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య కుమార్తె లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించారు. 41 ఏండ్ల సుచేతన భట్టాచార్య ఆపరేషన్‌తో పురుషునిగా మారాలనుకుంటున్నట్టు ప్రకటించారు.

ఒక వ్యక్తి లింగమార్పిడి చేయించుకోవడం అనేది ఆర్ధికంగానే కాదు, సామాజికంగా కూడా చిన్న విషయం కాదు. నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అలాంటి నిర్ణయం నిర్భయంగా తీసుకున్నారు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య. ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. తాను పుట్టుకతో మహిళ అయినప్పటికీ, చిన్నప్పటి నుంచి మానసికంగా పురుషుడి లాగానే జీవించానని, ఇప్పుడు శారీరకంగానూ పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ ఎల్‌జీబీటీక్యూ వర్క్‌షాప్‌నకు హాజరయిన తరువాత ఈ విషయం పై తనకు పూర్తి అవగాహనా వచ్చింది అన్నారు. 41 ఏళ్ల వయసులో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని, ఇదే విషయంపై న్యాయ నిపుణులు, వైద్యులు, ఇతర నిపుణుల సలహాలు తీసుకున్నానన్నారు. తాను పురుషుడిగా మారిన తర్వాత తన పేరును సుచేతన భట్టాచార్య నుంచి.. సుచేతన్‌గా మార్చుకోనున్నట్లు తెలిపారు. తన జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాల లాగానే మహిళ నుంచి పురుషుడిగా మారాలనే నిర్ణయాన్ని తానే స్వయంగా తీసుకున్నట్లు సుచేతన తెలిపారు. ఈ విషయంపై ఎవరూ వివాదం కానీ.. రాద్దాంతం కానీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నుంచి ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఈ వివాదంలోకి తన తల్లిదండ్రులను లాగవద్దని మీడియాకు సూచించారు.

లింగ మార్పిడి శస్త్ర చికిత్స అంటే సెక్స్ రిఅసైన్మెంట్ సర్జరీ. లైంగిక అవయవాలు, లైంగికత వేరువేరుగా ఉన్న వారిని ట్రాన్స్ జెండర్లు అంటారు. వారికి ఈ సర్జరీ అవసరం అవుతుంది. ఈ సర్జరీ కోరుకునే వాళ్ళకి వైద్యులు ముందుగా జెండర్ డిస్పోరియా అంటే వారు శరీర తత్వానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పరీక్షిస్తారు. తరువాత హార్మోన్ థెరపీ చేస్తారు. తర్వాత మాత్రమే సర్జరీ చేస్తారు. అది కూడా వయస్సు 20 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే.

Tags

Read MoreRead Less
Next Story