CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!

CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!
మరోసారి తెరపైకి పౌరసత్వ సవరణ చట్టం..

పౌరసత్వ సవరణ చట్టం-CAAకు సంబంధించిన నిబంధనలను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కేంద్ర హోంశాఖ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. CAAకు సంబంధించిన నిబంధనలు సిద్ధమయ్యాయని అధికారి ఒకరు తెలిపారు. పౌరసత్వం ప్రక్రియ మెుత్తం డిజిటల్‌గా జరుగుతుందని ఇందుకు అన్‌లైన్‌ పోర్టల్‌ కూడా సిద్ధం చేశామని చెప్పారు. దరఖాస్తుదారులు తాము భారత్‌లోకి ఏ ఏడాది ప్రవేశించామో వెల్లడిస్తే సరిపోతుందన్నారు. అంతకుమించి ఎలాంటి ప‌త్రాలు అవసరం లేదని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత నాలుగు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టం అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పన ఎట్టకేలకు పూర్తయిందని, వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా సీఏఏను కేంద్రం అమలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. పౌరసత్వ నమోదు కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ కూడా సిద్ధమైందని, కేంద్ర హోంశాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ట్రయల్‌ రన్స్‌ నిర్వహించిందని తెలిపాయి. దీర్ఘకాలిక వీసా కోసం హోంశాఖ వద్దకు వచ్చిన దరఖాస్తులకు అధిక శాతం పాకిస్థానీయుల నుంచే వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాంగ్‌టర్మ్‌ వీసాలను మంజూరు చేసే అధికారాన్ని కేంద్రం ఇప్పటికే తొమ్మిది రాష్ర్టాల్లోని 30 జిల్లాల మేజిస్ట్రేట్‌లకు అప్పగించింది.

ఏమిటీ సీఏఏ?

పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019, డిసెంబర్‌లో కేంద్రం తీసుకొచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్‌ 31 కంటే ముందు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్‌ మతస్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే సీఏఏ నిబంధనలు ఇప్పటి వరకు ఖరారు కాలేదు.

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి2014 డిసెంబరు 31 లోపు భారత్‌లోకి వచ్చిన బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, హిందువులుకు సీఏఏ చట్టం. పౌరసత్వాన్ని కల్పించనుంది. పౌరసత్వ సవరణ బిల్లు-2019ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంది. రాష్ట్రపతి కూడా బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారింది. అయితే సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో కేంద్రం చట్టాన్ని అమలు చేయలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందే... సీఏఏను అమలు చేస్తామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు

Tags

Read MoreRead Less
Next Story