Jharkhand: జార్ఖండ్‌లో జోరందుకున్న క్యాంపు రాజకీయాలు..

Jharkhand: జార్ఖండ్‌లో జోరందుకున్న క్యాంపు రాజకీయాలు..
Jharkhand: జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు ప్రచారం ప్రకంపనలు రేపుతోంది.

Jharkhand: జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు ప్రచారం ప్రకంపనలు రేపుతోంది. జార్ఖండ్‌లో అప్పుడే క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఇటు అధికార జేఎంఎం కూటమి.. అటు ప్రతిపక్ష బీజేపీ ఎవరికివారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకవేళ తన ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటుకు గవర్నర్ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సీఎం సోరేన్ పావులు కదుపుతున్నారు. అలాగే ప్రత్యర్థుల బేరసారాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు సోరెన్.

నేతలెవరూ చేజారిపోకుండా సంకీర్ణ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బస్సుల్లో క్యాంపులకు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం సోరెన్‌ నివాసం వద్ద రెండు బస్సులు కనిపించాయి. ఆ తర్వాత ఉదయం ఎమ్మెల్యేలంతా బ్యాగులతో ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. అనంతరం మధ్యాహ్నం సంకీర్ణ ఎమ్మెల్యేలు బస్సుల్లో సోరెన్‌ ఇంటి నుంచి బయల్దేరారు. ఎమ్మెల్యేలందరినీ కుంతీ జిల్లాకు తరలించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ లేదా పశ్చిమబెంగాల్‌కు ఎమ్మెల్యేలను పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇక.. 81 మంది సభ్యులున్న జార్ఖండ్‌ అసెంబ్లీలో సోరెన్‌ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో జార్ఖండ్‌ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సోరెన్‌పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది సంకీర్ణ కూటమి.

ముఖ్యమంత్రిగా ఉంటూ జార్ఖండ్‌లో గనుల లీజును సోరెన్‌.. తనకు తానే కేటాయించుకోవడం వివాదాస్పదమైంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష బీజేపీ.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్ నిబంధనలను ఉల్లంఘించారని.. సీఎంగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు అందించిన వినతిపత్రాన్ని గవర్నర్ రమేష్ బైస్.. ఎన్నికల సంఘానికి పంపించారు. ఈసీ కూడా తన అభిప్రాయాన్ని గురువారం సీల్డ్‌కవర్‌లో గవర్నర్‌కు పంపింది. ఈసీ సిఫార్సుతో సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వంపై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags

Read MoreRead Less
Next Story