MODI: ఒకే దేశంలో రెండు చట్టాలుంటాయా: మోడీ

MODI: ఒకే దేశంలో రెండు చట్టాలుంటాయా: మోడీ
యూనిఫామ్ సివిల్‌ కోడ్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు.... ఒక దేశంలో రెండు చట్టాలు ఎలా ఉంటాయని ప్రశ్న... ఇస్లాం దేశాలు ట్రిపుల్‌ తలాక్‌ను ఎందుకు రద్దు చేశాయని నిలదీత...

యూనిఫామ్ సివిల్‌ కోడ్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు చట్టాలతో ఒక దేశాన్ని నడపలేమని స్పష్టం చేశారు. ఒకే కుటుంబంలోని వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు నిబంధనలు ఎలా వర్తిస్తాయని ప్రధాని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన మేరీ బూత్‌ సబ్‌సే మజ్‌బూత్‌ అనే ప్రచార కార్యక్రమంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.... యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌, ఉమ్మడి పౌర స్మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఉందని మోడీ వ్యాఖ్యానించారు. దేశానికి యూనిఫాం సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అవసరమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముస్లింలను కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రెచ్చగొడుతున్నాయని మోడీ మండిపడ్డారు. బుజ్జగింపు రాజకీయాలతో ముస్లింలు వెనకపడ్డారని విమర్శించారు. కొంతమంది బుజ్జగింపు రాజకీయాలను దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగిస్తున్నారని మోడీ విమర్శించారు.

ఉమ్మడి పౌరస్మృతిపై ప్రతిపక్షపార్టీలు ఓటుబ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడుతున్నాయని మోడీ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ACగదుల్లో కూర్చొని తాము ఆదేశాలు ఇవ్వమని, కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజల వెంటే ఉంటామని మోడీ అన్నారు. రాజ్యాంగంలోనూ ప్రజలందరికీ సమానహక్కులు ఉండాలని...యూనిఫాం సివిల్ కోడ్ రాజ్యాంగంలో భాగమని అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి తేవాలని సుప్రీంకోర్టు పదేపదే చెబుతోందని మోడీ గుర్తు చేశారు.

ట్రిపుల్‌ తలాక్‌కు మద్దతు ఇస్తున్నవారు....ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. ట్రిపుల్ తలాక్ ఆచారం ఇస్లాం నుంచి విడదీయరానిదైతే..ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాలు ఎందుకు దానిని ఆచరించడం లేదని మోడీ ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్‌ను ఎవరు సమర్ధిస్తున్నారో వారే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. ట్రిపుల్‌ తలాక్‌ కేవలం ముస్లిం మహిళలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదని.. ట్రిపుల్ తలాక్ మొత్తం కుటుంబాన్ని విచ్ఛినం చేస్తుందని మోడీ అన్నారు. ఈజిప్ట్‌లో 90 ఏళ్ల క్రితమే ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దేశంలోని ముస్లిం సోదరులు, సోదరీమణులను అర్థం చేసుకోవాలని ప్రతిపక్షాలకు మోడీ హితవు పలికారు.

Tags

Read MoreRead Less
Next Story