Dhiraj Sahu raids: కాంగ్రెస్‌ ఎంపీపై ఐటీ దాడులు.. రూ.351 కోట్లు .. అంతకు మించి ..

Dhiraj Sahu raids: కాంగ్రెస్‌ ఎంపీపై ఐటీ దాడులు.. రూ.351 కోట్లు .. అంతకు మించి ..
ఐటీ సోదాల చరిత్రలోనే టాప్

కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు దాచిన సొమ్మును ఆదాయపు పన్ను శాఖ పట్టుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 318 కోట్ల రూపాయలను రికవరీ చేసింది. ప్రస్తుతం నోట్ల లెక్కింపు కొనసాగుతోందని, ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాహు నుంచి రికవరీ అయిన డబ్బును ఒడిశాలోని బోలంగీర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలో లెక్కిస్తున్నారు. కాగా, అర్థరాత్రి వరకు మొత్తం నగదును లెక్కించనున్నట్లు ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.

గత 4 రోజులుగా కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ, ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న డబ్బును అధికారులు లెక్కించారు.ఎటు చూసినా నోట్ల కట్టలే.. బీరువాలు, గదుల నిండా డబ్బే. పన్ను ఎగవేత ఆరోపణలతో దాడులు చేసిన ఐటీ శాఖ అధికారులు ఆ డబ్బు కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. కట్టల కట్టల డబ్బు.. లెక్కపెట్టలేక కౌంటింగ్‌ మెషీన్లు కూడా మొరాయించాయి. ఇప్పటివరకు రూ.351 కోట్ల నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.

ఈరోజు తెల్లవారుజామున ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ భగత్ బెహెరా మాట్లాడుతూ, తమ వద్దకు 176 నోట్లతో నిండిన బ్యాగులు వచ్చాయని, వాటిలో 140 లెక్కించినట్లు తెలిపారు. 50 మంది బ్యాంకు అధికారులు 25 మిషన్లతో నగదు లెక్కిస్తున్నారని ఆయన తెలిపారు.



అయితే డబ్బుల లెక్కింపు పూర్తి కాలేదని.. ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేపట్టిన సోదాల్లో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం.పట్టుబడిన డబ్బు అంతా దేశవ్యాప్తంగా ఆ సంస్థ, డిస్ట్రిబ్యూటర్లు, ఇతరులు నిర్వహించిన నగదు అమ్మకాల ద్వారా వచ్చిందని.. అయితే అది లెక్కల్లోకి రాని మొత్తం అయి ఉండొచ్చని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కంపెనీలో భారీ ఎత్తున నగదు పట్టుబడటం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఈ ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే బదులిచ్చింది. ధీరజ్‌ సాహు వ్యాపారాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన ఆస్తులతోపాటు ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు గుర్తించిన నగదు గురించి సాహు మాత్రమే వివరణ ఇవ్వాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

గతంలో 2019లో కాన్పూర్‌ కేంద్రంగా ఉన్న ఒక వ్యాపార సంస్థపై అధికారులు దాడి చేసి 257 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దేశంలో అదే పెద్ద మొత్తం.

Tags

Read MoreRead Less
Next Story