ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర ? పరారీలో అనుమానిత జేఈ

ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర ? పరారీలో అనుమానిత జేఈ

ఒడిస్సా రైలు ప్రమాదం 292 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ రైలు ప్రమాదంలో అనుమానితుడుగా భావిస్తున్న ఒక జూనియర్ ఇంజనీర్ కుటుంబంతో సహా కనపడకుండా పోయాడు. రెండవసారి విచారణకు అతన్ని ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులకు తాళం కనిపించింది. ఇంటిని సీజ్ చేసిన అధికారులు జూనియర్ ఇంజనీర్ కోసం గాలింపు మొదలుపెట్టారు.

292 మంది ప్రయాణికుల మరణానికి కారణమై వెయ్యి మందిని గాయాలపాలు చేసిన ఒడిస్సా రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఇది ప్రమాదం కాదు కుట్ర అంటూ బలంగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈనెల ఆరవ తేదీన సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. రంగంలోకి దిగిన అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా సోరో సెక్షన్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అమీర్ ఖాన్ ను విచారించారు. బాహనగర్ స్టేషన్ మాస్టర్ ఇంటికి వెళ్లి దర్యాప్తు చేశారు. తరువాత మళ్ళీ సోరో సెక్షన్ ఇంజనీర్ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించగా అతను కనబడకుండా పోవడంతో ఇంటిని సీజ్ చేశారు.

జూన్ రెండవ తేదీన కోరమండల్ ఎక్స్ ప్రెస్ బాలసూర్ లో పట్టాలు తప్పింది. ఆ తర్వాత లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది. ఈ సంఘటనలో కొన్ని కోచ్ లు పక్కపక్కనే ఉన్న ట్రాక్ లపై ప్రయాణిస్తున్న మరో పాసింజర్ రైలును ఢీకొట్టాయి. గూడ్స్ పైకి కోరమాండల్ రాయల్ ఇంజన్ ఎక్కింది. ఈ ఘోర ప్రమాదంలో 292 మంది ప్రయాణికులు మరణించారు. ఘటన జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ బాలసూర్ వెళ్లి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఇక రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సుమారు మూడు రోజులపాటు అక్కడే ఉండి 51 గంటల్లో రైలు మార్గాన్ని పునరుద్ధరించేలా చేశారు. అయితే ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంలో ఉద్దేశపూర్వకంగా ఎవరో జోక్యం చేసుకోవడం వల్లే ఒడిస్సా రైలు దుర్ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ఈ రైలు ప్రమాదంలో బహనాగా రైల్వే స్టేషన్ మాస్టర్ తో సహా ఐదుగురు రైల్వే ఉద్యోగుల ప్రమేయం ఉందన్న కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది.

నిజానికి రైళ్లు సురక్షితంగా రాకపోకలు సాగించటంలో జూనియర్ ఇంజనీర్ పాత్ర ఎంతో ముఖ్యమైనది సిగ్నలింగ్ పరికరాల ఏర్పాటు, నిర్వహణ, మరమ్మత్తులు, మెషిన్లు ఇంటర్ లాకింగ్ సిస్టం ఇవన్నీ అతనే చూసుకోవాలి. అవన్నీ సవ్యంగా ఉన్నప్పుడు మాత్రమే గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఏ చిన్న సమస్య ఉన్న గ్రీన్ రాదు రెడ్ మాత్రమే వస్తుంది. అయితే బాలాసోర్ రైలు ప్రమాద సమయంలో గ్రీన్ సిగ్నల్ పడటం వెనుక ట్యాంపరింగ్ జరిగి ఉండవచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి. ఇదే సమయంలో జేఈ కనబడకుండా పోవడం కుట్ర జరిగి ఉంటుందన్న మాటకు బలం చేకూరుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story