Onion Prices : కిలో ఉల్లి రూ.25కే..

Onion Prices : కిలో ఉల్లి రూ.25కే..
మరిన్ని నగరాల్లో సబ్సిడీ ధరకు విక్రయించనున్న కేంద్రం

దేశంలో ఉల్లి ధరల మోత మోగుతోంది. ధరలు పెరిగిన తర్వాత కేంద్రం నేరుగా జోక్యం చేసుకుంది. రిటైల్ మార్కెట్ లో సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను విక్రయించింది. దీంతో ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఉల్లి ధర తగ్గుముఖం పట్టింది. అయితే కొన్ని నగరాల్లో మాత్రమే కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. మొన్నటివరకు కిలో ఉల్లి రూ.30-రూ.40 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యుల జేబులకు ఉల్లి చిల్లు వేస్తోంది. ఈ క్రమంలోనే ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బఫర్ స్టాక్ నుంచి రిటైల్ మార్కెట్లలోకి లక్ష టన్నుల ఉల్లిని విడుదల చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉల్లి ధరలను తగ్గించడం కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

దేశవ్యాప్తంగా కిలో ఉల్లిని సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.25 కే విక్రయిస్తోంది. దీనికి తోడు ఈ నెలలోనే మార్కెట్లలోకి బఫర్ స్టాక్ నుంచి లక్ష టన్నుల ఉల్లిని రిలీజ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో హోల్‌సేల్ కిలో ఉల్లి ధర రూ. 30 కి పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత తగ్గనున్నాయని.. దీంతో సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుందని పేర్కొంటున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహుల్ సింగ్ ఈ విషయాన్ని గురువారం తెలిపారు. ఈ నెలలో రిటైల్ మార్కెట్లో లక్ష టన్నుల ఉల్లిపాయను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ఉల్లిని విక్రయించడం వల్ల దేశంలోని ప్రముఖ నగరాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయని అధికార వర్గాలు చెప్పాయి.

అయితే ఉల్లి వ్యాపారులు మాత్రం కేంద్రం కనీస ఎగుమతి ధరను క్వింటాకు 800 డాలర్లు (రూ. 65,160) గా నిర్ణయించడం వల్లే హోల్ సేల్ మార్కెట్లో ధర తగ్గినట్లు చెబుతున్నారు. అక్టోబర్ 28న కేంద్రం ఈ ధరను నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఉల్లి పంట ఎక్కువగా చేతికి వస్తోందని, మండీలకు కూడా చేరుతోందని అన్నారు. అందుకే ఉల్లి ధర తగ్గుముఖం పడుతుందని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story