PM MODI: ఇక ఆగస్టు 23 నేషనల్‌ స్పేస్‌ డే

PM MODI: ఇక ఆగస్టు 23 నేషనల్‌ స్పేస్‌ డే
చంద్రయాన్‌-3 విజయానికి గుర్తుగా జరుపుకుందామన్న ప్రధాని మోదీ... చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు...

చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపి చరిత్ర సృష్టించిన ఆగస్టు 23(August 23 )ను అందరిక్ష విజ్ఞాన దినోత్సంవంగా జరుపుకుందామని ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) పిలుపునిచ్చారు. జై విజ్ఞాన్‌ జై అనుసంధాన్‌ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ దిగిన ప్రదేశానికి శివశక్తి అని ప్రధాని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాకుండా చంద్రుడిపైనా త్రివర్ణ పతాకం ఎగురుతోందని అన్నారు. మేకిన్‌ ఇండియా ఇప్పుడు చంద్రుడి వరకు సాగిందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల(ISRO scientists )కు మోదీ అభినందనలు తెలిపారు.


భారతదేశం ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతోందన్న మోదీ తాను దక్షిణాఫ్రికాలో ఉన్నా మనసంతా ఇక్కడే ఉందన్నారు. మిమ్మల్ని కలవడానికి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశానని తెలిపారు. భారత్ సత్తా ఏంటో ఇస్రో ప్రపంచానికి చూపించిందని, ఇస్రో శాస్త్రవేత్తల కృషికి, నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్-3( Chandrayaan-3 mission) విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని కలిగించిందని, ఇది మామూలు విజయం కాదన్నారు. చంద్రయాన్‌ త్రీ ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.


చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నేరుగా బెంగళూరు(Bengaluru)కు వచ్చారు. విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులకు మోదీ అభివాదం చేశారు. విమానాశ్రయం బయట మాట్లాడారు. భారత ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమైందన్నారు. అక్కడి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్ త్రీ ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌( ISRO Chairman S Somanath) వివరించారు.

చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టిందని అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించామని ఇప్పుడు భారత్‌ చంద్రుడిపై ఉందని మోదీ అన్నారు. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసిందని, చంద్రయాన్‌ - 3 దిగిన ప్రదేశానికి శివశక్తి ("Shiva Shakti Point) అని పేరు పెట్టుకుందామని అన్నారు. చంద్రయాన్‌ -2( Chandrayaan-2) వైఫల్యంతో మనం వెనకడుగు వేయలేదని... మరింత పట్టుదలతో పనిచేసి చంద్రయాన్‌ -3 విజయం సాధించామని మోదీ గుర్తు చేశారు. శాస్త్ర, సాంకేతికరంగాల్లో భారత్‌ దూసుకెళ్తోందని ప్రపంచానికే భారత్‌ దిక్సూచిగా మారుతోందని అన్నారు. చంద్రయాన్‌ - 3 కృషిలో మహిళా శాస్త్రవేత్తలు ఉండటం గర్వకారణమన్న ప్రధాని మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటామన్నారు. ఇస్రో సాధించిన విజయం ఎన్నో దేశాలకు స్పూర్తినిస్తుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story