Chhattisgarh CM Bhupesh Baghel: మహిళల అకౌంట్‌లో ఏటా రూ.15,000

Chhattisgarh CM Bhupesh Baghel: మహిళల అకౌంట్‌లో ఏటా రూ.15,000
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'గృహ లక్ష్మి యోజన

దీపావళి సందర్భంగా మహిళలకు భారీ కానుక ఇస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీదేవి అనుగ్రహం, ఛత్తీస్‌గఢ్ మహతారి ఆశీస్సులతో రాష్ట్రంలో మహిళా శక్తి కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలోని మహిళలకు “ఛత్తీస్‌గఢ్ గృహ లక్ష్మి యోజన”{‘గర్బో నవ ఛత్తీస్‌గఢ్’} కింద వారి ఖాతాల్లో నేరుగా సంవత్సరానికి రూ.15,000 వేస్తామని ఆయన అన్నారు. మహిళలకు ఇచ్చే సాయం నేరుగా వారి అకౌంట్లలోనే జమ అవుతుందన్నారు. ఈమేరకు ఆదివారంనాడు ఆయన ఒక ట్వీట్ చేశారు.

వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో దశలో 70 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే మహిళా ఓటర్ల కోసం సీఎం భూపేష్ బఘెల్ భారీ ప్రకటన చేశారు.'దీపావళి శుభ తరుణంలో లక్ష్మీదేవి ఆశీస్సులతో రాష్ట్రంలో మహిళా సాధికారతకు కీలక నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఛత్తీస్‌గఢ్ గృహ లక్ష్మి యోజన పథకం కింద ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం నేరుగా మహిళల అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించాం. ఛత్తీస్‌గఢ్ సుసంపన్నమై, పేదరిక నిర్మూలన జరగాలనే సంకల్పంతో రాబోయే ఐదేళ్లు మా ప్రభుత్వం పని చేస్తుంది. దీపావళి శుభ సందర్భంగా మన తల్లులు, సోదరీమణులు ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్ చేశారు.

గృహ లక్ష్మి యోజన పథకం కింద మహిళలు ఎలాంటి దరఖాస్తులు పూర్తిచేయాల్సిన అవసరం లేదని, క్యూలలో నిలుచునే పని లేదని సీఎం తెలిపారు. ప్రభుత్వమే స్వయం ఇంటింటికి వచ్చి సర్వే చేస్తుందని, ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేస్తుందని, నేరుగా అకౌంట్లలోకి సొమ్ములు జమ అవుతాయని బఘెల్ స్పష్టం చేశారు. కాగా, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నవంబర్ 7న జరుగగా, నవంబర్ 17న రెండో విడత పోలింగ్‌ ఉంటుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Tags

Read MoreRead Less
Next Story