CHINA VISA: 71 వేల మంది భారతీయులకు చైనా వీసాలు

CHINA VISA: 71 వేల మంది భారతీయులకు చైనా వీసాలు
తొలి ఆరు నెలల్లో 71, 600 వీసాలు జారీ చేశామన్న చైనా... భారీగా వీసాలు జారీ చేసినట్లు వెల్లడి...

చైనా ఈ ఏడాది భారతీయులకు అత్యధికంగా వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని భారత్‌లో చైనా కాన్సులేట్‌ కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు. వ్యాపారం, అధ్యయనం, పర్యాటకం, వ్యక్తిగత పనులు, కుటుంబాలను కలుసుకునేందుకు భారతీయ పౌరులకు భారీగా వీసాలు మంజూరు చేశామని ఆయన ట్వీట్ చేశారు. చైనా పౌరులపై వీసా ఆంక్షలను త్వరగా ఎత్తివేసి, చైనా- భారత్‌ మధ్య ప్రజల రాకపోకలను పునఃప్రారంభించాలని ఎదురుచూస్తున్నామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. గత మూడేళ్లలో తొలిసారిగా భారత్‌తో సహా విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతిస్తామని ఈ ఏడాది మార్చిలో చైనా ప్రకటించింది.


2023 మొదటి ఐదు నెలల్లో చైనాకు వెళ్లే భారతీయులకు చైనా రాయబార కార్యాలయం 60 వేల కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు ఈ ఏడాది మే నెలలో వాంగ్ జియా జియాన్ ప్రకటించారు. అనంతరం గత రెండు నెలల్లోనే ఈ సంఖ్య 71, 600కు చేరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మొదటి అయిదు నెలల్లో చైనా కాన్సులేట్ 60 వేల వీసాలు జారీ చేసిందని, చైనాకు స్వాగతమని ఆయన గతంలో కూడా ట్వీట్‌ చేశారు.


దేశీ పర్యాటకులకు, విద్యార్థులకు చైనా ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న శుభవార్త చెప్పింది. విదేశీయులపై అమలులో ఉన్న వీసా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోవిడ్ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. చైనాలో కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి కారణంగా అక్కడి ప్రభుత్వం కట్టడి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా లాక్‌డౌన్ విధించింది. విద్యా సంస్థలు, పర్యాటక ప్రదేశాలపై ఆంక్షలను అమలు చేసింది. చైనాలో ఉన్న విదేశీయులను సైతం అక్కడి నుంచి పంపించింది. దీంతో చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువులను ఆపేసి స్వదేశాలకు తిరిగి వెళ్లారు. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులు కూడా ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. మళ్ళీ చైనాకు వెళ్లడానికి అక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది.


విదేశీ పర్యాటకులకు, విద్యార్థులకు, ఇతరులకు వీసా మంజూరు ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సడలింపు ఈ ఏడాది మార్చి 15 నుంచే ప్రారంభించారు. క్రాస్ బార్డర్ ట్రావెల్‌ని సులభతరం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. తద్వారా చైనాలోకి అధిక సంఖ్యలో విదేశీయులు తరలివచ్చే సౌలభ్యం కలుగుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చైనీయులు కూడా ఇతర దేశాల్లో పర్యటించడానికి సులభం అవుతుందని అభిప్రాయపడింది.

వీసా రహిత ప్రయాణాలను పున: ప్రారంభించి, వాటిని మరింత మెరుగు పరచడానికి చైనా ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ మేరకు వీసా మంజూరు ప్రక్రియలో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. క్రూయిజ్ షిప్పుల ద్వారా షాంఘై నగరానికి చేరుకునే వారికి వీసా లేకున్నా దేశంలోకి అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story