Cooking Oil Prices: భారీగా పెరుగుతున్న వంటనూనె ధరలు.. ఎంతంటే..?

Cooking Oil Prices: భారీగా పెరుగుతున్న వంటనూనె ధరలు.. ఎంతంటే..?
Cooking Oil Prices: భారత్‌కే కాదు ప్రపంచంలోనే ఈ సన్‌ఫ్లవర్‌ ఎక్స్‌పోర్ట్‌లో ఈ రెండు దేశాలదీ 80 శాతం వాటా ఉంటుంది.

Cooking Oil Prices: ఎవడికో తుమ్మొస్తే మనకు జలుబు చేసినట్టు ఉంది పరిస్థితి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంకొన్ని రోజులు ఇలాంటి వాతావరణమే కొనసాగితే ఆయిల్ ప్యాకెట్‌ డబుల్‌ సెంచరీ దాటడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం భారత్‌కు దిగుమతి అవుతున్న సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో 70 శాతం ఉక్రెయిన్‌ నుంచి 20 శాతం రష్యా నుంచి వస్తోంది.

భారత్‌కే కాదు ప్రపంచంలోనే ఈ సన్‌ఫ్లవర్‌ ఎక్స్‌పోర్ట్‌లో ఈ రెండు దేశాలదీ 80 శాతం వాటా ఉంటుంది. అక్కడ యుద్ధం కారణంగా ఇప్పుడు మన దగ్గర 160 రూపాయలు ఉన్న లీటర్‌.. త్వరలోనే 250 వరకూ పెరిగినా ఆశ్చర్యం లేదని మార్గెట్‌ వర్గాలు చెప్తున్నాయి. రిటైల్‌ మార్కెట్‌లో ఆయిల్‌ ధరలు ఇప్పటికే చాలా చోట్ల లీటరుకు 10 నుంచి 20 రూపాయలు పెంచేసి అమ్ముతున్నారు.

ఇదే టైమ్‌లో కొందరు ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్‌లో మరింత గోల్‌మాల్‌కి పాల్పడుతున్నారు. సన్‌ ఫ్లవర్ ఆయిల్‌ మాత్రమే కాదు పామాయిల్ ధర కూడా లీటరుకు 10 వరకూ పెంచేశారు. కంపెనీలు కూడా ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ పరిస్థితులకు తగ్గట్టు 8 శాతం వరకూ రేట్లు పెంచాయంటున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం చూస్తే మనం ఏటా 2.5 మిలియన్‌ టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉపయోగిస్తున్నాం.

ఇందులో ఇందులో 50 వేల టన్నులు మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతుంటే మిగతాది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 2019లో 100 రూపాయలకు అటు ఇటుగా ఉన్న ఈ నూనె రేటు ఇప్పుడు ఏకంగా 165 దాటేసింది. ఇప్పటి వరకూ ఈ స్థాయిలో పెరుగుదలకు కరోనా కారణమైతే, ఇప్పుడు యుద్ధం వల్ల అతిసమీపంలో మరో 100 వరకూ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

మధ్యతరగతి వారిపై ఈ రేట్లు తీవ్రమైన ప్రభావాన్నే చూపించబోతున్నాయి. వంట నూనెల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశీయంగా పామాయిల్‌ వంటి తోటల ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం 11 వేల కోట్లతో ప్రత్యేక కార్యాచరణ ప్రకటించినా ఇప్పటికైతే ఈ డబుల్ రేట్ల గండాన్ని ఎదుర్కోక తప్పదని మార్కెట్‌ ఎనలిస్ట్‌లు చెప్తున్నారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి ముందు ఎక్స్‌పోర్ట్‌ కోసం వేర్‌హౌస్‌లలో 3 లక్షల 50 వేల టన్నుల నూనె సిద్ధంగా ఉన్నా.. ఇప్పుడది భారత్‌ చేరే మార్గం లేదు. ఈ యుద్ధం ఆగి శాంతిచర్చలు ఫలించి అంతా సాధారణ స్థితి వచ్చి, అక్కడి ఫ్యాక్టరీలు షట్‌డౌన్‌ నుంచి తిరిగి ఉత్పత్తి ప్రారంభిస్తే తప్ప.. ఈ సంక్షోభాన్ని గట్టెక్కేందుకు ప్రత్యమ్నాయం ఏదీ కనిపించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story