మానవ తప్పిదం వల్లే కరోనా సెకండ్ వేవ్ : సీసీఎంబీ

మానవ తప్పిదం వల్లే కరోనా సెకండ్ వేవ్ : సీసీఎంబీ

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందనే ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ-CCMB కీలక ప్రకటన చేసింది. సెకండ్ వేవ్ అనేది ప్రజలకు ఓ వార్నింగ్ అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. వైరస్‌లో మార్పులు కారణంగా సెకండ్ వేవ్ మొదలు కాదని.. మానవ తప్పిదం వల్లే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. సెకండ్ వేవ్ వస్తే కష్టమేనని.. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ప్రస్తుతం ఢిల్లీలో సెకండ్ వేవ్ కొనసాగుతోందని.. గతకొన్ని రోజులుగా అక్కడ రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలోని అన్ని చోట్లా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సంభవించే అవకాశాలు ఉన్నాయన్న రాకేశ్‌ మిశ్రా.. కొన్నిసార్లు వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే ఛాన్స్ ఉందన్నారు.

పండగలు, పెళ్లిళ్లు, గుంపులుగా ఉండే ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని రాకేశ్‌ మిశ్రా సూచించారు.మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం ద్వారా వేవ్‌లను ఆలస్యం చేయవచ్చని తెలిపారు. మరో రెండేళ్ల పాటు ప్రజలు ఈవిధంగానే అప్రమత్తంగా ఉండాలన్నారు. 60 నుంచి 70 శాతం యాంటీబాడీలు వచ్చి హర్డ్ ఇమ్యూనిటీ లేదా వాక్సిన్ వచ్చేవరకు ఇలా వేవ్‌లు వస్తూనే ఉంటాయన్నారు. వ్యాక్సిన్ల ప్రభావశీలత తేలేందుకు నెలలు కాదు.. ఏళ్ల కొద్దీ సమయం పడుతుందని చెప్పారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే మరో రెండేళ్లు పడుతుందని అందుకే మాస్క్‌, శానిటైజేషన్, భౌతిక దూరంతోనే వైరస్‌ను జయించాలని సూచించారు...

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే సెకండ్ వేవ్ మొదలైందని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో వరుసగా మూడోరోజూ 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అలాగే, దాదాపు నాలుగు నెలల తర్వాత తొలిసారి 66 మరణాలు సంభవించడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా నమోదైన వాటితో కలిపి ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6 వేల769కి చేరింది. ఢిల్లీలో ప్రస్తుతం 38 వేల 729 క్రియాశీల కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 12.84 శాతంగా ఉంది. పండుగ సీజన్‌కు వాయు కాలుష్యం తోడవ్వడంతో కేసులు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

కరోనా విజృంభణ కారణంగా దేశంలో దాదాపు 6 నెలలపాటు లాక్‌డౌన్ విధించారు. ఇప్పుడిప్పుడే ఆంక్షలన్నీ తొలగించడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే వింటర్ సీజన్ వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలుంటాయి. అందుకే రాబోయే 90 రోజులు అత్యంత కీలకం అని అధికారులు చెబుతున్నారు..ఇప్పటికే పలుచోట్ల సెకండ్ వేవ్ కనిపిస్తున్న నేపథ్యంలో పాజిటివ్‌ కేసులో మళ్లీ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మళ్లీ లాక్‌డౌన్ విధించే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇప్పటికే పలు యూరప్ కంట్రీల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story