పులిని బెదరగొట్టిన ఆవుల మంద

పులిని బెదరగొట్టిన ఆవుల మంద
ఆవుపై పులి దాడి- పులిపై ఆవుల మంద ఎదురుదాడి.. వీడియో వైరల్

ఐకమత్యమే మహాబలం అన్నమాట మనం చిన్నప్పటినుంచి ఎన్నోసార్లు చదువుకొని ఉంటాం. దానికి సంబంధించి పాత కథలు విని ఉంటాం. కానీ తాజాగా ఒక సంఘటన కొత్త కథను క్రియేట్ చేసింది. తన గ్యాంగ్ తో ఎదురుపడి పెద్దపులినే బెంబేలు ఎత్తించిన ఆవుల మంద కధ చదవండి.

సమస్య వచ్చినప్పుడు తన వారికి తోడు ఉండడమే ఐకమత్యం. అలాంటి ఐకమత్యం మనలో ఉండాలని చిన్నప్పటి నుంచి చాలా కథలు చెప్తారు. అన్నదమ్ములు సఖ్యంగా ఉండాలి. కుటుంబం అంటే అందరూ కలిసి ఉండాలి అనే మాటని బ్రెయిన్ లోకి ఎక్కిస్తారు.

కానీ జంతువులకు అలాంటిదేమీ ఉండదు. అయినా సరే తోటి ఆవుని కాపాడుకోవడానికి ఆ ఆవుల మంద చేసిన ధైర్యం చూస్తే అవాక్కవక తప్పదు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆవుల మంద నుంచి కాస్త దూరంగా, ఒంటరిగా ఉన్న ఓ ఆవుపైకి ప్లాన్ చేసుకొని దాడికి దిగింది ఓ పెద్దపులి. ఒక్కసారి షాక్ అయిన ఆవు పెద్దగా అరచింది.ఆ అరుపులో బాధే కనిపించిందో, ఆక్రందనే వినిపించిందో తెలియదు. మిగతా ఆవుల మంద పరుగు పరుగున అక్కడికి వచ్చాయి. వాస్తవానికి ఆవుపై దాడిచేస్తున్న పులిని చూసి మిగతా ఆవులు భయంతో పారిపోవాలి, కానీ అవి అలా చేయలేదు. తమ తోటి ప్రాణికి అండగా నిలిచాయి. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు ఉరికాయి.

అన్ని ఆవులూ కలిసి పులిపై దాడికి దిగాయి. అన్ని ఆవులు ఒక్కసారిగా దూసుకురావడంతో భయపడిన పులి పట్టుకున్న ఆవును వెంటనే వదిలిపెట్టింది. కానీ దాని ఆశ ఇంకా చావలేదు. అక్కడక్కడే తిరిగి మరో అదను కోసం ఎదురు చూసింది. అయితే ఈసారి ఆవులు గాయపడిన ఆ ఆవును కాపాడేందుకు ప్లాన్ చేశాయి. బయట ఉన్న ఆవులే కాదు, ఆవులశాలలో ఉన్న ఇతర ఆవులన్నీ చుట్టుముట్టి మళ్లీ దాడికి దిగకుండా తెల్లవారే దాకా కాపలాగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి భోపాల్‌ కేర్వా శివారులోని ఓ డెయిరీ ఫామ్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పశువుల శాలలో 50 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నిర్వాహకులు చెబుతున్న ప్రకారం గత ఆరు నెలలలో పులి ఇలా దాడి చేయడం ఐదవ సారి.

Tags

Read MoreRead Less
Next Story