Rahul Gandhi: వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ బరిలో దిగే అవకాశం లేదా?

Rahul Gandhi: వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ  బరిలో దిగే అవకాశం లేదా?
వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా భార్య అన్నీ రాజా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా రాహుల్ రెండు స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి తమ అభ్యర్థిగా అన్నీ రాజాను సీపీఐ ప్రకటించింది. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు. వయనాడ్ నుంచి గెలుపొందారు.

ఇక కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ -IUML ఈ దఫా మూడు సీట్ల అడుగుతుండగా అందులో వయనాఢ్ నియోజకవర్గం ఉంది. వయనాఢ్ నియోజకవర్గంలో ముస్లిం సంఖ్య అధికంగా ఉండటంతో IUML ఆ స్థానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీపీఐ కూడా వయనాఢ్ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి అన్నీ రాజాను బరిలోకి దించింది. ఇండియా కూటమిలో సీపీఐ ఉండటంతో రాహుల్ ఆ స్థానంలో పోటీ చేయడంపై సందిగ్ధత ఏర్పడింది.

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. యూపీలోని రాయబరేలీ నుంచి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాయబరేలీ ఎంపీగా సోనియాగాంధీ ఉన్నారు. ఆమె రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో, రాయబరేలీ నుంచి రాహుల్ పోటీ చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాకముందే... వయనాడ్ అభ్యర్థిని సీపీఐ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ తో సంప్రదింపుల తర్వాతే తమ అభ్యర్థిని సీపీఐ ప్రకటించిందా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.

అన్నీ రాజా విషయానికి వస్తే సీపీఐలో ఆమె కీలక నాయకురాలిగా ఉన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సీపీఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు కూడా. సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా భార్యనే అన్నీ రాజా.

Tags

Read MoreRead Less
Next Story