Crimes Against Women :మగాడు మారలేదు.. దేశంలో మహిళలపై పెరిగిన నేరాలు…

Crimes Against Women :మగాడు  మారలేదు.. దేశంలో మహిళలపై పెరిగిన నేరాలు…
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెబుతుందంటే…

దేశంలో మహిళలపై నేరాలు గతంలో కంటే గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మహిళలపై దాడులు, కిడ్నాప్‌లు, అత్యాచారాల కేసుల సంఖ్య పెరిగిందని జాతీయ నేరాల వార్షిక నివేదిక తాజాగా వెల్లడించింది. మహిళల భద్రతకు పలు చట్టాలున్నా, వీటి అమలులో ఏర్పడుతున్న అడ్డంకులతో నేరాల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది కంటే 2023 వ సంవత్సరంలో మహిళలపై నేరాల రేటు 4 శాతం పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా వెల్లడించింది.

అందులోనూ మహిళలపై నేరాల కేసుల్లో ఎక్కువ శాతం భర్త లేదా వారి బంధువులే ఉన్నారని తేలింది. మహిళల కేసుల్లో 31.4 శాతం మంది నిందితులు భర్త, బంధువులే ఉన్నారని క్రైం బ్యూరో రికార్డులు స్పష్టం చేశాయి. దేశంలో 19.2 శాతం కిడ్నాప్ లు, 18.7 శాతం లైంగిక వేధింపుల కేసులు, 7.1 శాతం అత్యాచారం కేసులు నమోదయ్యాయి. దేశంలో మహిళలు వరకట్న వేధింపులు సైతం ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలో 13,479 మంది మహిళలు వరకట్న వేధింపుల బారిన పడ్డారని నేర గణంకాలు తేటతెల్లం చేశాయి.

సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ వల్ల మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతుందని మహిళా హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. వరకట్నం సమస్య కూడా మహిళలపై నేరాలు పెరగడానికి కారణమవుతోందని సుప్రీంకోర్టు న్యాయవాది చెప్పారు. దేశంలో 2022వ సంవత్సరంలో మహిళలపై నేరాలకు సంబంధించి 4.45 లక్షల కేసులు నమోదయ్యాయి. గంటకు 51 కేసులు మహిళలపై నమోదవుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. లక్ష జనాభాలో మహిళలపై నేరాల రేటు 66.4 శాతంగా ఉంది.

దేశంలో అత్యధిక లైంగిక హింస కేసులు ఢిల్లీలో జరిగాయని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మీరన్ చద్దా బోర్వాంకర్ చెప్పారు. 2022 వ సంవత్సరంలో ఢిల్లీలో మహిళలపై 14,247 కేసులు నమోదయ్యాయని క్రైం రికార్డ్స్ బ్యూరో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, లైంగిక వేధింపులు లేదా గృహ హింసకు సంబంధించి కేసు నమోదు పెట్టడానికి మహిళలు మగ బంధువు తోడు లేకుండా పోలీసు స్టేషన్‌కు కూడా రావడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు సాగుతున్నా కేసుల నమోదు మాత్రం తక్కువగా ఉంటుందని మరో పోలీసు అధికారి చెప్పారు.

మహిళల భద్రత కోసం అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం 1956, వరకట్న నిషేధ చట్టం 1961, సతీ కమిషన్ చట్టం 1987, గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005, మహిళలపై లైంగిక వేధింపులపై చట్టాలున్నా బాధితురాళ్లు కేసుల నమోదుకు ముందుకు రావడం లేదు. దీంతో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా సాగుతున్నా కేసుల నమోదు తక్కువగా ఉంది. అయినా దేశంలో ఏయేటి కాఏడు మహిళలపై అత్యాచారాల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story