CWC: సీడబ్ల్యూసీ లో ప్రధానంగా చర్చించిన విషయాలివే...

CWC: సీడబ్ల్యూసీ లో ప్రధానంగా చర్చించిన విషయాలివే...
ఎన్నికలకు సర్వసన్నద్ధం

రాబోయే లోక్ సభ ఎన్నికలకు పార్టీ పరంగా తక్షణమే సన్నహాలు నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC నిర్ణయించింది. విపక్షాల కూటమి ఇండియాలోని భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ హై కమాండ్ CWC భేటీలో లోక్ సభ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు కె. వేణుగోపాల్ , జైరాం రమేశ్ వివరాలను వెల్లడించారు. ఈనెలలోనే స్ర్కీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ అభ్యర్థుల ఎంపికను సత్వరమే పూర్తి చేస్తామని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని... రాష్ట్రాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రను మళ్లీ చేపట్టాల్సిందిగా రాహుల్ కు CWC విజ్ఞప్తి చేసిందనిదీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ నేతలు వివరించారు. మరోవైపు విపక్ష కూటమి ఇండియా భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటును సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వ్యతిరేకతతో ప్రధాని పీఠం ఎవరిని వరిస్తుందనేది దానిపై చర్చ ఊపందుకుంది. కాగా, మంగళవారం ఢిల్లీలో విపక్షాల కూటమి ‘ఇండియా’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రధానమంత్రి పదవికి ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆయన దానిని తిరస్కరించారు.

ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. అయితే దీనిపై ఖర్గే స్పందిస్తూ.. ముందుగా ఎన్నికల్లో గెలవాలని, మిగతావి తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. నిధుల సమీకరణలో ప్రజలను భాగస్వాములు చేస్తూ పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇటీవల తీసుకున్న చర్యలను వర్కింగ్‌ కమిటీ స్వాగతించింది. సీడబ్ల్యూసీలోని ప్రతి సభ్యుడు ఇందులో పాలుపంచుకోవాలని కోరింది. ఖర్గేతో పాటు అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక సహా 76 మంది సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, రాహుల్‌ రెండో దశ భారత్‌ జోడో యాత్ర చేపట్టాలని కూడా కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈసారి తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర సాగుతుందని వేణుగోపాల్‌ తెలిపారు. రాహుల్‌ యాత్రను మళ్లీ ప్రారంభించాలని ప్రజలు, కార్యకర్తలు, నేతలు కోరుకుంటున్నారని ఖర్గే సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభంలో పేర్కొన్నారు. దీనిని సభ్యులంతా సమర్థించారు. పార్లమెంట్‌ నుంచి 143 మంది ఇండియా కూటమి ఎంపీలను బహిష్కరించడాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. మూడు క్రూరమైన క్రిమినల్‌ జస్టిస్‌ బిల్లులను ఆమోదింప చేసుకునేందుకే ఇలా చేశారని తీర్మానంలో ఆరోపించింది.

Tags

Read MoreRead Less
Next Story