ముంచుకొస్తున్న బిపర్ జాయ్ ముప్పు

ముంచుకొస్తున్న బిపర్ జాయ్ ముప్పు
అప్రమత్తంగా ఉండాలంటున్నా వాతావరణ శాఖ. గుజరాత్‌కు ఆరెంజ్ అలర్ట్.

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జాయ్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారింది. ఈ ప్రభావంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షానికి తోడు బలమైన గాలులు వీస్తూ ఉండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్ళించారు. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై విమానాశ్రయంలోని రన్వేను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మహారాష్ట్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమయ్యారు.

బిపర్ జాయ్ తుఫాను గుజరాత్ లోని కచ్, పాకిస్తాన్ లోని కరాచీల మధ్య ఈ నెల 15వ తేదీన తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కచ్ తీరంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ లోని దక్షిణ, ఉత్తర తీరాల్లో మత్స్య సంబంధిత కార్యకలాపాలను నిలిపివేశారు. గుజరాత్ తో పాటు కర్ణాటక, గోవాలోనూ ఈదురుపాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలు ఉండొచ్చని అంచనా. సముద్రమంతా అల్లకల్లోలంగా మారగా కొన్ని ప్రాంతాలలో రాకాసి అలలు భయపెడుతున్నాయి.

ఇప్పటిదాకా అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్లలో ఇది రెండవ బలమైన తుఫానుగా మారుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. తుఫాను పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కీలకమైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story