KOTA: ఆత్మహత్యలు ఆపేందుకు" దర్వాజ్‌ పే దస్తక్‌"

KOTA: ఆత్మహత్యలు ఆపేందుకు దర్వాజ్‌ పే దస్తక్‌
కోటాలో ఆత్మహత్యల నివారణకు మరో కార్యక్రమం

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలను ఆపేందుకు పోలీసులు మరో కార్యక్రమం చేపట్టారు. "దర్వాజే పె దస్తక్‌"(knock on door) పేరుతో హాస్టల్‌ వార్డెన్లు, మెస్‌ పనివాలు, టిఫిన్‌ సెంటర్లను ఈ కార్యక్రమంలో భాగం చేయనున్నారు. సాధారణంగా విద్యార్థులు కోచింగ్ తర్వాత ఎక్కువ సమయం హాస్టళ్లలోనే గడుపుతుంటారు. అందుకే ప్రతి హాస్టల్ వార్డెన్ రాత్రి 11గంటల సమయంలో విద్యార్థుల గదుల తలుపులు తట్టి అంతా బాగానే ఉందా అని అడగాలని వార్డెన్లకు పోలీసులు సూచించారు. విద్యార్థుల్లో ఒత్తిడి, అసాధారణమైన స్థితి కనిపిస్తే వెంటనే చెప్పాలని ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థులపై కన్నేసి ఉంచేందుకు"దర్వాజే పె దస్తక్‌" పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మెస్‌లకు భోజనం తినడానికి విద్యార్థులురాకున్నా, తీసుకెళ్లిన టిఫిన్‌ తినకుండా వెనక్కి ఇచ్చేసినా వెంటనే సమాచారం ఇవ్వాలని మెస్‌ పనివాళ్లు, టిఫిన్ సెంటర్లకు సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ఆపేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కోటా ASP చంద్రశేఖర్‌ ఠాకూర్‌ తెలిపారు.

పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ది చెందిన రాజస్థాన్‌లోని కోటా ప్రాంతాంలో వరుసగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. వివిధ ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటాలో పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 20 మందికిపైనే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒత్తిడే ఈ ఆత్మహత్యలకు దారితీస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి.


విద్యార్థుల ఆత్మహత్యలు ఆపేందుకు కోటాలోని ఉన్న వసతి గృహాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవనాల చుట్టూ ఇనుప వలలు పెట్టారు. అలాగే వారు ఉండే గదుల్లో కూడా సీలింగ్ ఫ్యాన్‌లకి బదులుగా స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చారు. జిల్లా అధికార యంత్రంగంతో కలిసి వసతి గృహాల యజమానులు ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఒకవేళ ఎవరైన విద్యార్థి భవనంపై అంతస్తు నుంచి దూకినా కూడా అతనికి గాయాలు కాకుండా ఉండేందుకు ఆవరణల్లో వలలు కట్టారు. ఈ వరుస ఆత్మహత్యల నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను హాస్టళ్లలో ఉంచేందుకు వెనుకాడుతున్నారు. కోటాలోనే ఇల్లు అద్దెకు తీసుకుని వాళ్లు కూడా పిల్లలతో కలిసి ఉంటున్నారు.

కోటా కోచింగ్ సెంటర్లో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్న విద్యార్థులకు మానసిక సహాయాన్ని అందించడానికి అక్టోబర్ వరకు అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కోచింగ్ సెంటర్ యాజమాన్యం తెలిపింది. ఆత్మహత్యల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు రెండు నెలల పాటు పరీక్షలు నిర్వహించకుండా నిషేధం విధించారు.

Tags

Read MoreRead Less
Next Story