Parliament : నారీ శక్తివందన్ బిల్లుపై చర్చ..

Parliament :  నారీ శక్తివందన్ బిల్లుపై చర్చ..
మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. అమలుకు ఆరేళ్లు ఆగాల్సిందే!

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో33 శాతం సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. నూతన పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వేళ.. ఈ కీలక బిల్లును మోదీ సర్కార్‌ తీసుకొచ్చింది. మహిళా శక్తి వందన్‌ అభియాన్‌ పేరుతో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ వివరించారు. అయితే తమకు బిల్లు కాపీలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనల మధ్యే బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లుపై నేటి నుంచి నుంచి లోక్‌సభలో చర్చ జరగనుంది. తర్వాత ఓటింగ్‌ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. రాజ్యసభలో ఈనెల 21న..ప్రవేశపెట్టనున్నారు. తాజా బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు కాదని కేంద్రం స్పష్టత ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ల అంశంపై కొత్తగా రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని వెల్లడించింది. తర్వాత అసెంబ్లీల ఆమోదం కోసం బిల్లును పంపనున్నారు. అయితే..2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిపిన అనంతరమే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. 15ఏళ్ల పాటు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయన్న ఆయన .రొటేషన్ ప్రక్రియలో మహిళలకు నియోజకవర్గాల కేటాయింపు ఉంటుందని వివరించారు.

ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయి. బిల్లు ఆమోదం పొంది చట్టరూపు దాలిస్తే ప్రస్తుతం 82 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య 181 అవుతుంది. ఈ నారీశక్తి వందన్ చట్టం దేశ అభివృద్ధిలో మహిళ పాత్రను నిర్ధారిస్తుంది. 2047నాటికి అభివృద్ధి చెందిన భారతవానిలో కీలక మైలురాయిగా నిలుస్తుంది. మహిళాఅభివృద్ధికి నూతన దిశ చూపే చట్టం అవుతుంది.

అంతకుముందు మాట్లాడిన ప్రధాని మోదీ రిజర్వేషన్‌ బిల్లు మహిళా సాధికారికతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారన్న మోదీ అనేక రంగాల్లో నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. కొత్త భవనంలో నారీశక్తిని బలోపేతం చేసేలా తొలి నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బిల్లుకు విపక్షాలు కూడా మద్దతు ప్రకటిస్తుండటం వల్ల చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story