PM Modi: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ కార్యకర్తలకు మోడీ విజయ మంత్రం

PM Modi: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ కార్యకర్తలకు  మోడీ విజయ మంత్రం
ఈ 100 రోజులు చాలా కీలకం అంటున్న ప్రధాని

సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ తిరిగి అధికారం చేపట్టేందుకు...నూతన ఓటర్లను కలిసి వారి విశ్వాసం చూరగొనేందుకు భాజపా శ్రేణులు వచ్చే వంద రోజులు పునరుత్తేజం, విశ్వాసంతో పని చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సర్వసన్నద్ధం చేసేందుకు...దిల్లీలో నిర్వహించిన భాజపా జాతీయ మండలి సమావేశంలో...ప్రధాని మోదీ ప్రసంగించారు. 2047నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించటానికి ఇప్పుడు పెద్దకలలు కనటంతోపాటు పెద్ద సంకల్పాలు చేపట్టాల్సి ఉందన్నారు. కోట్లాదిమంది మహిళలు, పేదలు, యువత కలలు...ఇప్పుడు మోదీ కల అని అన్నారు. భారీ కుంభకోణాలు, ఉగ్రదాడుల నుంచి దేశానికి విముక్తి కల్పించామన్న ప్రధాని...పేదలు, మధ్య తరగతి వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చినట్లు చెప్పారు. దేశం కోసం పనిచేయటానికే తప్ప పదవి వ్యామోహంతో మూడోసారి అధికారం కోరుకోవటం లేదని తెలిపారు. వికసిత భారత్‌ లక్ష్యంగా...యువత, మహిళలుసహా రైతు శక్తిని ఏకం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

పదేళ్లు అవినీతిలేని పాలన అందించటం, పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి కల్పించటం...చిన్న విషయం కాదని ప్రధాని మోదీ తెలిపారు. సీఎంగా, ప్రధానిగా తాను ఎంతో చేసినందున ఇక విశ్రాంతి తీసుకోవాలని ఓ సీనియర్‌ నేత తనకు సూచించారని, అయితే తాను రాష్ట్రనీతి కోసం తప్ప రాజనీతి కోసం పనిచేయటం లేదని ప్రధాని మోదీ చెప్పారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణం చేపట్టి దేశ ప్రజలు ఐదు దశాబ్దాల ఎదురు చూపులకు భారతీయ జనతా పార్టీ ముగింపు పలికినట్లు ప్రధాని మోదీ తెలిపారు. గుజరాత్‌లోని పావగధ్‌లో 5వందల ఏళ్ల తర్వాత మతపరమైన జెండా ఎగిరిందన్నారు. ఏడు దశాబ్దాల కర్తార్‌పుర్‌ సాహిబ్‌ రహదారిని తెరిచినట్లు చెప్పారు. అలాగే ఏడు దశాబ్దాల తర్వాత అధికరణ 370 నుంచి దేశం స్వేచ్ఛ పొందినట్లు ప్రధాని మోదీ చెప్పారు. తనను మూడోసారి ప్రధానిని చేయాలని తాను అడుగుతున్నది ఎంజాయ్ చేయడానికి కాదని మోదీ అన్నారు.

‘నేను నా ఇంటి గురించే ఆలోచించితే.. దేశంలోని కోట్లాది మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే వాడిని కాదు. పేద పిల్లల భవిష్యత్తు కోసమే నేను బతుకుతున్నాను. నేను సమస్యలను పరిష్కరిస్తానని భావిస్తున్న కోట్లాది మంది మహిళలు, పేదలు, యువత కలలను నెరవేర్చడానికే నేను ఉన్నాను’ అని మోదీ చెప్పారు.ఈ 100 రోజులు చాలా కీలకం

ఈ దేశ కలలు ఎన్డీఏ కూటమితోనే నెరవేరతాయని మోదీ చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. తాను గ్యారంటీ ఇస్తున్నానని అన్నారు. రికార్డు స్థాయిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మించామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story