AIIMS Doctors: అవిభక్త కవలను విడదీసి ప్రాణం పోసారు

AIIMS Doctors: అవిభక్త కవలను విడదీసి ప్రాణం పోసారు
ఆస్పత్రిలోనే ఆనందంగా ఫస్ట్ బర్త్​డే

ఆ తల్లిదండ్రులు కవల పిల్లలు పుట్టారు అన్న ఆనందాన్ని పూర్తిగా పొందలేక పోయారు. ఎందుకంటే వీరిద్దరూ అవిభక్త కవలలు. కంజాయిన్డ్ ట్విన్స్. ఛాతీ నుండే కడుపు వరకు అమ్మాయిలు ఒకరికొకరు అంటుకుని ఉన్నారు. అయితే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు అద్భుతం చేశారు. కొన్ని గంటలపాటు ఆపరేషన్ చేసి వారిని వేరు చేశారు.

తోడబుట్టిన వారు ఉంటే ఆనందమే కానీ వారిద్దరూ శారీరకంగా కలిసి ఉండే ఉండాలంటే ఎంత కష్టమో ఊహించలేం. వారిని చూసినప్పుడల్లా అందరూ ఇలాగే ఫీల్ అవుతారు. వారి జీవనం కూడా ఇబ్బందికరంగానే మారుతుంది. వారిని విడదీయటం కూడా అంత సులువైనది ఏమీ కాదు. అలాంటి ఓ ఇద్దరిని ఎయిమ్స్ వైద్యులు కొన్ని గంటలపాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా వేరు చేశారు. ఇటీవల చిన్నారులు తమ మొదటి పుట్టిరోజును ఆస్పత్రిలోనే జరుపుకున్నారు. వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే..



ఉత్తర్‌ప్రదేశ్‌ బరేలీకి చెందిన దీపికా గుప్తా, నాలుగో నెల గర్భం ఉన్నప్పుడే కడుపులో అవిభక్త కవలలు ఉన్నట్లు స్థానిక వైద్యులు గుర్తించారు. దీంతో అత్యాధునిక సౌకర్యాలు గల దిల్లీ ఎయిమ్స్‌కు ఆమెను రిఫర్ చేశారు. గతేడాది జూలై 7న అవిభక్తులుగా జన్మించిన రిద్ధి, సిద్ధి అనే ఆడ కవల శిశువులను.. ఎయిమ్స్‌లోని చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగ వైద్యులు అయిదు నెలల పాటు ఇంటెన్సివ్ కేర్​ యూనిట్- ఐసీయూలో ఉంచారు.

ఛాతీ నుంచి కడుపు వరకూ అతుక్కుపోయి ఉన్న వీరికి కాలేయం, ఛాతీ ఎముకలు, ఊపిరితిత్తుల డయాఫ్రాగమ్, గుండెలోని కొన్ని భాగాలు కూడా కలిసిపోయాయి. శస్త్ర చికిత్సను తట్టుకునే సామర్థ్యం వచ్చిన నేపథ్యంలో గత నెల 8వ తేదీన తొమ్మిది గంటల పాటు శస్త్ర చికిత్సను నిర్వహించి విజయవంతంగా విడదీశారు. కాలేయం, గుండె ప్రాంతాన్ని వేరు చేయడం సవాలుగా మారిందని చెప్పిన డాక్టర్లు అనేక సర్జన్ల బృందాలు ఆపరేషన్ ను కచ్చితత్వంతో, సమర్ధతతో పూర్తి చేసినట్టుగా మీడియాకు వివరించారు.

ప్రస్తుతం కోలుకుంటున్న ఆ శిశువులిద్దరూ తమ మొదటి పుట్టిన రోజును ఈ నెలలో ఆస్పత్రిలోనే జరుపుకొన్నారు. దీంతో కవలల తల్లిదండ్రులు దీపిక, అంకుర్​ గుప్తా వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story