జాతీయ

Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది సజీవదహనం..

Delhi: దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. 26 మంది సజీవదహనంతో కాకావికలమైంది.

Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది సజీవదహనం..
X

Delhi: దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. 26 మంది సజీవదహనంతో కాకావికలమైంది. బాధితుల రోదనతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదకరంగా మారింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. అలుముకున్న దట్టమైన పొగలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అయింది. వెస్ట్ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని మూడు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన మంటలు వ్యాపించడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.

మంటల్లో చిక్కుకుని 26 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 10 గంటల వరకు ప్రజలు భవనంలోనే చిక్కుకున్నారు. మరోవైపు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

మంటలను అదుపు చేసేందుకు 24 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. భవనంలో చిక్కుకున్న దాదాపు 60, 70 మందిని సురక్షితంగా ప్రాణాలతో రక్షించారు. ఇక మంటలు చెలరేగిన సమయంలో కొంతమంది భవనంపై నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. నాలుగు అంతస్తుల భవనంలోని మెుదటి అంతస్థులో ఉన్న సీసీటీవీ కెమెరాల కార్యాలయంలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత భవనం మొత్తం వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు.

సీసీటీవీ కెమెరాల షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు అంతస్తుల కమర్షియల్ భవనంలో పలు సంస్థలు కార్యాలయాలను నిర్వహిస్తున్నాయని డీసీపీ సమీర్‌ శర్మ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES