Delhi flood: ఢిల్లీపై జలఖడ్గం... యమునా నది మహోగ్రరూపం

Delhi flood: ఢిల్లీపై జలఖడ్గం... యమునా నది మహోగ్రరూపం
యమునా నది ఉప్పొంగడంతో సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి


దేశ రాజధాని ఢిల్లీపై జలఖడ్గం విరుచుకుపడుతోంది. కుంభవృష్టి ధాటికి యమునా నది మహోగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్నారు. యమునా నది ప్రమాదకరస్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఢిల్లీలో కట్టలు తెగి ఉగ్రరూపం దాల్చిన యమునా నది ప్రవాహం ఆల్‌టైమ్ రికార్డుకు చేరింది. యమునా నది నీటిమట్టం 208.51 మీటర్లకు చేరింది. ప్రమాదరకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని వాసులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటివరకు 1978లో 207.49 మీటర్లే గరిష్ట స్థాయి వరద ఉప్పొంగింది. ఇపుడు చరిత్రలో తొలిసారిగా సేఫ్ లైన్ దాటి డేంజర్ బెల్ మోగిస్తుండటంతో జలప్రళయం ఎంతటి ముప్పును, ఎలాంటి విపత్తును తెచ్చిపెడుతుందోనని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇపుడు అందరి దృష్టి యమునా నదిపైనే ఉంది. యమునా నది ఉప్పొంగడంతో సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. జల ఉప్పెన ఢిల్లీని పూర్తిగా ముంచెత్తింది. అనేక కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి మోకాలి లోతు నీరు చేరి నదులను తలపిస్తున్నాయి. సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో రింగ్‌ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కశ్మీరీ గేట్‌ - మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది. అటు ఢిల్లీ సచివాలయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. నదులను తలపిస్తున్న రహదారులపై కొందరు రిక్షాలను పడవలుగా చేసి రోడ్లను దాటుతున్న దారుణ పరిస్థితి నెలకొంది.

ముంచుకొస్తున్న వరద ముప్పుతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తుగా రక్షణ బృందాలను మోహరించింది. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు యమునా నది ప్రవాహం, వరద పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేజీవాల్‌ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించామని.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు నిర్ణయించామని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రైవేట్ సంస్థలు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేపట్టాలని తెలుపామని చెప్పారు. వరద ఉద్ధృతి కారణంగా యమునా బ్యాంక్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. మూడు వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడొచ్చని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు.

అటు ఉత్తరాదిలో భారీ వర్షాలు జలప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. కుంభవృష్టి వర్షాలకు హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్తాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భీకర వరదలు సంభవిస్తున్నాయి. వరదల ధాటికి రోడ్లు కోతలకు గురికాగా.. చెరువులు, కాలువలు తెగిపడి పరవళ్లు తొక్కుతున్నాయి. ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లో దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఉత్తరప్రదేశ్‌లో 12 మంది మృతిచెందగా.. హర్యానా, పంజాబ్‌లో 21 మంది చొప్పున మరణించారు. ఉత్తరాఖండ్‌లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక జతీయ రహదారులను మూసివేశారు. భారీ వర్షాలతో హత్నీకుండ్‌ నుంచి హర్యానా నిరంతరంగా వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశముందని కేంద్ర జల కమిషన్‌ అంచనా వేస్తోంది. అదే జరిగితే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story